SP Hinduja | హిందూజా గ్రూప్ సంస్థల చైర్మన్, శ్రీచంద్ పరమానంద్ హిందుజా బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీచంద్ పరమానంద్ హిందుజా లండన్ లో అంతిమ శ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీ చంద్ పరమానంద్ హిందుజా మరణం పట్ల ఆయన సోదరులు గోపిచంద్ హిందుజా, ప్రకాశ్ హిందూజా, అశోక్ హిందుజా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
హిందుజా బ్రదర్స్ లో అందరికన్నా శ్రీ చంద్ పరమానంద్ హిందుజా పెద్దవారు. 1935 నవంబర్ 28న నాటి బ్రిటిష్ ఇండియాలోని సింధ్ ప్రావిన్స్ కరాచీలో ఉన్నారు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గత జనవరిలోనే శ్రీ చంద్ పరమానంద్ హిందుజా భార్య మధు మరణించారు.
‘ఆయన మాకు మార్గదర్శి, గురువు. మా తండ్రి పీడీ హిందుజా నేర్పిన విలువలకు కట్టుబడి పని చేశారు. బ్రిటన్ తోపాటు భారత్ మధ్య శక్తిమంతమైన సంబంధాలు నెలకొల్పడంలో చాలా ముఖ్య పాత్ర పోషించారు’ అని హిందుజా ఫ్యామిలీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆయన ఒక అధ్యాత్మికవేత్తగా, దాతృత్వంలోనూ పేరొందారు.
2020 సన్ డే టైమ్స్ సంపన్నుల జాబితాలో హిందూజా బ్రదర్స్ గ్రూప్ ఒకటిగా నిలిచింది. నాడు ఈ సంస్థ సంపద 1600 కోట్ల పౌండ్లు.ముంబై కేంద్రంగా హిందూజా గ్రూప్ పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించింది. హిందుజాలు లండన్లో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. ఆటోమోటివ్, ఆతిథ్యం, బ్యాంకింగ్, హెల్త్ కేర్ రంగంలో సేవలందించారు.
రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు వెలుగు చూసిన ‘భోఫోర్స్’ శత్రఘ్నుల కుంభకోణంలో హిందుజా కుటుంబం ముడుపులు అందుకున్నదన్న ఆరోపణలు ఉన్నాయి. 1964లో బాలీవుడ్ సినిమా ‘సంగం’ అంతర్జాతీయ పంపిణీ హక్కులు సొంతం చేసుకున్న శ్రీ చంద్ పరమానంద్ హిందూజా.. తదుపరి బ్రిటన్ లోనే అత్యంత సంపన్నుల్లో ఒకరిగా నిలిచారు.