Madhabi Puri Buch | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ చైర్పర్సన్ మాధవి పురి బచ్‌పై తాజాగా వచ్చిన అక్రమాల ఆరోపణలపై అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రిసెర్చ్ కొత్త అనుమానాలను లేవదీసింది. ఇంత జరుగుతున్నా మాధవి పురి ఏం మాట్లాడకుండా ఉన్నారంటే ఏదో జరిగే ఉంటుందన్నట్టు వ్యాఖ్యానించింది. ఏమీ లేకపోతే ఎందుకీ మౌనం? అంటూ ప్రశ్నించింది.
సెబీ సభ్యురాలిగా ఉన్నప్పుడు ఆయా కంపెనీల నుంచి చెల్లింపులు జరిగాయని, అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు మాధవి పురిపై వస్తున్న విషయం తెలిసిందే. కాగా, అదానీ అక్రమాలపై గత ఏడాది సంచలన రిపోర్టును తీసుకొచ్చిన హిండెన్‌బర్గ్.. ఈ వ్యవహారంలో సెబీ చీఫ్‌గా మాధవి పురి, ఆమె భర్తకూ లింకులున్నాయని గత నెల బయటపెట్టిన సంగతి విదితమే. దీన్ని అదానీ గ్రూప్, పురి దంపతులు కొట్టిపారేశారు.
కార్వీ ఖాతాలు జప్తు
కార్వీ స్టాక్ బ్రోకింగ్, ఆ సంస్థ సీఎండీ సీ పార్థసారథిలకు చెందిన బ్యాంక్-డీమ్యాట్ ఖాతాలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్‌ను జప్తు చేయాలని గురువారం సెబీ ఆదేశించింది. దాదాపు రూ.25 కోట్ల బకాయిల వసూలుకుగాను ఈ ఆదేశాలు జారీ చేసింది. క్లయింట్ల నిధులను పవర్ ఆఫ్ అటార్నీ దుర్వినియోగంతో కాజేసిన కేసులో భాగంగానే సెబీ ఈ చర్యలకు దిగింది.