న్యూఢిల్లీ, ఆగస్టు 31: హిండెన్‌బర్గ్ దెబ్బకు అతలాకుతలమైన గౌతమ్ అదానీపై మరో పిడుగుపడింది. ప్రమోటర్ గ్రూపుతో సంబంధం ఉన్న పలువురు వందల మిలియన్ల డాలర్లు అదానీ గ్రూపు స్టాక్ల్లో పెట్టుబడులు పెట్టినట్టు మరో అంతర్జాతీయ సంస్థ ఆర్గనైజెడ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు(ఓసీసీఆర్పీ) పేల్చిన బాంబుతో మార్కెట్లో కంపెనీ షేర్లు అతలాకుతలమయ్యాయి. మారిషస్‌కు చెందిన అజ్ఞాత ఇన్వెస్ట్మెంట్ ఫండ్ల ద్వారా ఈ భారీ పెట్టుబడులు వచ్చాయని గురువారం ఉదయం ఆరోపించడంతో నష్టాల్లో ప్రారంభమైన గ్రూపు షేర్లు చివరి వరకు ఇదే ట్రెండ్‌ను కొనసాగించాయి. ఒక దశలో ఐదు శాతం వరకు నష్టపోయిన షేర్లు..చివర్లో ఈ భారీ నష్టాన్ని తగ్గించుకోగలిగాయి. స్టాక్ మార్కెట్లో లిైస్టెన గ్రూపునకు సంబంధించిన పది షేర్లలో తొమ్మిది షేర్లు నాలుగు శాతం వరకు మార్కెట్ వాటాను కోల్పోయాయి. వీటిలో అత్యధికంగా అదానీ గ్రీన్ ఎనర్జీ 4.39 శాతం నష్టపోగా, ఎన్డీటీవీ కనిష్ఠంగా 1.92 శాతం తగ్గింది. కానీ, ఏసీసీ మాత్రం స్వల్పంగా పెరిగి రూ.2,009.55 వద్ద ముగిసింది. ఓసీసీఆర్పీ దెబ్బకు రూ.35,708 కోట్ల మార్కెట్ విలువ హారతీ కర్పూరంలాగా కరిగిపోయింది. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ ఆరోపణలో గ్రూపు మార్కెట్ విలువ 150 బిలియన్ డాలర్లు పతనమైన విషయం తెలిసిందే.
65 వేల దిగువకు సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్‌పడింది. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఆయిల్అండ్ గ్యాస్ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ప్రారంభంలో భారీగా లాభపడిన సూచీలు చివర్లో నష్టాల్లోకి జారుకున్నాయి. ఒక దశలో 65 వేల పైన ట్రేడైన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 255.84 పాయింట్లు నష్టపోయి 64,831.41 వద్ద ముగిసింది. ఆగస్టు నెలకుగాను డెరివేటివ్ కాంట్రాక్టు గడువు ముగియడంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ 93.65 పాయింట్లు కోల్పోయి 19,253.80 వద్ద నిలిచింది. ఏషియన్ పెయింట్స్ 1.33 శాతం నష్టపోయి టాప్ లూజర్‌గా నిలిచింది. ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీ, బజాజ్ ఫైనాన్స్, నెస్లె, టీసీఎస్, హెచ్‌యూఎల్, రిలయన్స్, పవర్ గ్రిడ్, కొటక్ బ్యాంక్‌లు నష్టపోయాయి. కానీ, మారుతి, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, టెక్ మహీంద్రా, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్‌లు లాభపడ్డాయి.