Higher Pension | ప్రైవేట్ సంస్థల్లో పని చేసే వేతన జీవులు అధిక పెన్షన్ కోసం ఉమ్మడి ఆప్షన్ దాఖలు చేయడానికి జూన్ 26 వరకు పొడిగిస్తున్నట్లు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ప్రకటించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల మూడో తేదీతో ఆన్లైన్ గడువు దరఖాస్తు ముగియనున్నది. ఆన్లైన్లో దరఖాస్తు చేయడంలో సభ్యులకు టెక్నికల్ సమస్యలు తలెత్తడంతోపాటు లింక్ చేయాల్సిన ఈపీఎఫ్‌వో పాస్‌బుక్ సర్వర్ మొరాయించింది. ఫలితంగా సకాలంలో అర్హత గల వేతన జీవులు, పెన్షనర్లు.. ఆప్షన్ దాఖలు చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో అధిక పెన్షన్‌కు ఉమ్మడి ఆప్షన్ దాఖలు చేయడానికి గడువు పొడిగించాలని ఈపీఎఫ్‌వో కమిషనర్‌కు పెన్షనర్లు, కార్మికులు, కార్మిక సంఘాలు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ (సీబీటీ) సభ్యులు విజ్ఞప్తి చేశారు. దీంతో అధిక పెన్షన్ కోసం ఉమ్మడి ఆప్షన్ గడువును వచ్చేనెల 26 వరకు ఈపీఎఫ్‌వో పొడిగించింది.
2014 కంటే ముందు ఉద్యోగంలో చేరి, ఆ తర్వాత కూడా కొనసాగుతూ.. ఈపీఎఫ్ గరిష్ట వేతన పరిమితి రూ.15 వేల కన్నా ఎక్కువ వేతనంపై ఈపీఎఫ్ చెల్లిస్తున్న ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లు అధిక పెన్షన్ కోసం ఉమ్మడి ఆప్షన్ ఇవ్వడానికి గత ఏడాది నవంబర్‌లో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. దీనిపై గత ఫిబ్రవరిలో గైడ్‌లైన్స్ జారీ చేసిన ఈపీఎఫ్‌వో.. మే 3 లోగా జాయింట్ ఆప్షన్ కోసం అప్లయ్ చేసుకోవాలని సూచించింది.
అప్లికేషన్లో పలు టెక్నికల్ సమస్యలు రావడంతో ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధిక పెన్షన్ దరఖాస్తులో కీలక పేర 26(6) కింద వాస్తవ వేతనంపై ఈపీఎఫ్ చందా చెల్లించడానికి ఈపీఎఫ్‌వో అనుమతి పత్రం జత చేయాలి. దీనికి తోడు ఈపీఎఫ్‌వో పాస్‌బుక్ తప్పనిసరిగా జత చేయాలి. గత నెలలో ఈపీఎఫ్‌వో పాస్‌బుక్ సర్వర్ మొరాయించింది. ప్రత్యేకించి అప్డేట్ పేరిట పాస్‌బుక్ సర్వర్ పని చేయలేదు. దీనికి తోడు పెన్షనర్ల పేర్లలో పొరపాట్లు, ఆధార్ అనుసంధానించకపోవడం వంటి కారణాలు ఆటంకంగా మారాయి.
అధిక పెన్షన్ కోసం కార్మికులు జాయింట్ ఆప్షన్ ఇవ్వడానికి నాలుగు నెలల గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టు తన తీర్పులో చెప్పినా.. ఈపీఎఫ్ఓ రెండు నెలల టైం మాత్రమే ఇచ్చింది. ఈ నేపథ్యంలో అర్హులు, పెన్షనర్లు అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువు పొడిగించాలని ఈపీఎఫ్‌వోను పలు కార్మిక సంఘాలు కోరాయి.