Indian Pharma | న్యూఢిల్లీ, మార్చి 6: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి కాలుదువ్వుతుండటం.. ఇప్పుడు భారత్‌సహా అన్ని దేశాల్లో గుబులు పుట్టిస్తున్నది. ముఖ్యంగా అమెరికా మార్కెట్‌పై ఆధారపడ్డ భారతీయ ఔషధ పరిశ్రమకు పెద్ద దెబ్బేనన్న అభిప్రాయాలు రోజురోజుకూ పెరుగుతుండటం గమనార్హం. సుంకాలు పెంచితే లక్ష కోట్ల రూపాయలపైనే దేశీయ ఫార్మా ఇండస్ట్రీ ప్రభావితం కావచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయిప్పుడు. తొలి దశలో 25 శాతం చొప్పున భారతీయ ఫార్మా దిగుమతులపై ట్రంప్ సర్కారు సుంకాలు వేయవచ్చని తెలుస్తున్నది. క్రమేణా దీన్ని పెంచుతూపోయే వీలున్నట్టు సమాచారం.
మేకిన్ అమెరికా..
అమెరికాలో మళ్లీ తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి, అక్కడి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచడానికి దేశంలోకి వస్తున్న విదేశీ వస్తువులపై దిగుమతి సుంకాలను పెంచడమే మార్గమని ట్రంప్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆటో, సెమీకండక్టర్స్తోపాటు ఫార్మా దిగుమతులపైనా హై టారిఫ్‌లను పరిశీలిస్తున్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తున్నది. అమెరికాలో తయారు చేయండి.. లేకపోతే అధిక టారిఫ్‌లను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇప్పటికే ఆయా కంపెనీలకు ట్రంప్ సర్కారు తేల్చిచెప్పినట్టు కూడా తెలియవస్తున్నది. ఇక ప్రస్తుతం భారత్ నుంచి దిగుమతి అవుతున్న ఫార్మా ఉత్పత్తులపై అమెరికా ఎలాంటి సుంకాలు వేయడం లేదు. కానీ అమెరికా నుంచి దిగుమతి అవుతున్న ఔషధాలపై భారత్ 10 శాతం సుంకాలను వేస్తున్నది. ఇది కూడా ట్రంప్ ఆగ్రహానికి దారితీస్తున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మన ఫార్మాతో లాభమే..
అమెరికాకు భారతీయ ఫార్మా దిగుమతులతో లాభమే ఎక్కువగా జరుగుతున్నది. అగ్రరాజ్య ఆరోగ్య సంరక్షణ రంగాన్ని 2022లో దాదాపు 408 బిలియన్ డాలర్ల మేర చౌక జనరిక్ ఔషధాలు ఆదుకున్నాయి. ఇవన్నీ భారత్, చైనా నుంచి వస్తున్నవే. దీంతో ఇప్పుడు వీటిపై సుంకాలు వేస్తే అమెరికా ప్రజలపైనే భారం మోపినట్టు అవుతుందన్న వాదనలూ తెరపైకి వస్తున్నాయి. దీంతో ఇప్పటికైతే ఫార్మా ఇండస్ట్రీకి సుంకాల నుంచి మినహాయింపు దక్కే అవకాశాలూ లేకపోలేదని అంటున్నారు. ప్రధానంగా భారతీయ ఔషధ కంపెనీలు తక్కువ లాభాలకే అమెరికా మార్కెట్లో తమ మందులను విక్రయిస్తున్నాయని మార్కెట్ నిపుణులూ గుర్తుచేస్తున్నారు.
ఏటా రూ.లక్షల కోట్లలో నష్టం?
ట్రంప్ హెచ్చరిస్తున్నట్టుగా ఏప్రిల్ 2 నుంచి అమెరికాకు ఎగుమతయ్యే భారతీయ వస్తూత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తే.. ఏటా లక్షల కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లుతుందని అంచనా. రసాయనాలు, లోహ వస్తువులు, నగలు, ఆటోమొబైల్స్, ఔషధాలు, వ్యవసాయం-ఆహారోత్పత్తి రంగాల కంపెనీలకు ఈ సుంకాల సెగ అధికంగా తగలనున్నది. అమెరికాకు భారత్ నుంచి వ్యవసాయ ఉత్పత్తులు పెద్ద ఎత్తున ఎగుమతి అవుతున్నాయి. 2021-22లో 5.7 బిలియన్ డాలర్ల మేర జరిగాయి. ఈ క్రమంలో భారతీయ అగ్రీ ఎక్స్‌పోర్ట్స్‌పై 100 శాతం సుంకాలకు వీలున్నట్టు చెప్తున్నారు. స్మార్ట్‌ఫోన్ ఎగుమతులకూ ఇబ్బందేనంటున్నారు. ఈ ఏడాదికి ఐఫోన్ల ఎగుమతి భారత్ నుంచి అమెరికాకు 8 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని అంచనా. దీంతో వీటిపై ట్రంప్ సుంకాల ప్రభావం పడనున్నది. అలాగే ఆభరణాలు, విలువైన రత్నాల ఎగుమతులు 7.6 బిలియన్ డాలర్లదాకా, యంత్ర పరికరాల ఎగుమతులు 6.1 బిలియన్ డాలర్ల వరకు ప్రభావితం కావచ్చని వినిపిస్తున్నది. 2023-24లో అమెరికాకు భారతీయ ఎగుమతులు 77.51 బిలియన్ డాలర్లుగా.. అమెరికా నుంచి దిగుమతులు 42.2 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
ఇదీ సంగతి..
గత ఏడాది అమెరికాకు భారత వ్యాపార ఎగుమతులు సుమారు 74 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ముత్యాలు, రత్నాలు, ఆభరణాల వాటానే 8.5 బిలియన్ డాలర్లు. ఔషధాల వాటా మరో 8 బిలియన్ డాలర్లుండగా, పెట్రోకెమికల్స్ ఎగుమతులు దాదాపు 4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక 2023లో అమెరికా నుంచి భారత్‌కు దిగుమతైన వస్తూత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం సగటున సుమారు 11 శాతం సుంకాలను వేసింది. భారత్ నుంచి అమెరికాకు దిగుమతైన వాటిపై అక్కడి ప్రభుత్వం వేసిన సుంకాలతో పోల్చితే ఇది దాదాపు 8.2 శాతం అధికం. మోటర్‌సైకిళ్లు, యాపిల్స్, క్రాన్బెర్రీస్, బాదాం, చిక్పీస్, వ్యాధి నిర్ధారణ వైద్య పరికరాల వంటి భారత్‌కు వస్తున్న కొన్ని ప్రధాన అమెరికా ఉత్పత్తులపై రెండంకెల స్థాయిలో దిగుమతి సుంకాలను మోదీ సర్కారు మోపుతున్నది.
నిజానికి అంతకుముందు ఇంకా ఎక్కువే ఉండేవి. బడ్జెట్లో తగ్గించినప్పటికీ మోటర్‌సైకిళ్లపై 30 శాతం, బాదాంపై 42-120 శాతం, యాపిల్స్‌పై 50 శాతం, డయాగ్నోస్టిక్ పరికరాలపై 35 శాతం సుంకాలు వర్తిస్తున్నాయి. అయితే ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ దేశాల నుంచి వస్తున్న దిగుమతుల కంటే అమెరికా నుంచి వస్తున్న దిగుమతులపైనే సుంకాలు ఎక్కువగా ఉంటున్నాయి. మినరల్స్‌పై సగటున 9.2 శాతం, పాదరక్షలపై 26.1 శాతం, టెక్స్‌టైల్స్‌పై 24.8 శాతం సుంకాలు పడుతున్నాయి. ఈ తీరే ఇప్పుడు ట్రంప్ ఆగ్రహానికి కారణమవుతున్నది. ఈ క్రమంలోనే తమపై ఎంత సుంకం వేస్తే.. అంతే సుంకం తిరిగి వేస్తామని తెగేసి చెప్తున్నారు. వచ్చే నెల 2 నుంచి టారిఫ్లుంటాయని ప్రకటించారు. ఫలితంగా భారత్‌పై ఇప్పుడు ఒత్తిడి పెరుగుతున్నది. వీలున్నంత వరకు ఆయా అమెరికా వస్తూత్పత్తులపై దిగుమతి సుంకాలకు కోత పెట్టింది. మరికొన్నింటిని సమీక్షిస్తున్నది.
అమెరికా టారిఫ్‌ల పెంపు భారతీయ జనరిక్ ఔషధాల తయారీ సంస్థలను పెద్ద ఎత్తున ప్రభావితం చేయగలదు. అయితే అమెరికా అవసరాల దృష్ట్యా ఫార్మాస్యూటికల్స్, జనరిక్ డ్రగ్స్‌పై ఈ సుంకాల నుంచి మినహాయింపు లభించగలదని ఆశిస్తున్నాను. అలాకాకపోతే అమెరికాలో తయారీపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
-వినితా గుప్తా, లుపిన్ ఫార్మా సీఈవో
అమెరికా టారిఫ్‌లను పెంచితే భారతీయ ఎగుమతులకు తప్పక విఘాతం కలుగుతుంది. అందుకే ఏప్రిల్‌లోగా అమెరికా సర్కారును భారత ప్రభుత్వం మెప్పించగలగాలి. అప్పుడే సుంకాల పెంపు ప్రభావం నుంచి బయటపడగలం. ఇక సుంకాల పెంపు ఎంత? అనేది ప్రస్తుతం అమెరికా వస్తూత్పత్తులపై భారత్ విధిస్తున్నదానిపైనే ఆధారపడి ఉంటుంది.
-అజయ్ శ్రీవాత్సవ, జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు