హైదరాబాద్, జూలై 8: టెలికాం పరికరాల తయారీ సంస్థ హెచ్ఎఫ్సీఎల్..వచ్చే రెండేండ్లలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఉత్పత్తి చేయడానికి రూ.950 కోట్ల మేర పెట్టుబడి పెట్టేయోచనలో ఉన్నది. ఈ విషయాన్ని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మహేంద్ర నహతా తెలిపారు. బుధవారం కంపెనీ డాటా సెంటర్ సొల్యూషన్ పొర్ట్ఫోలియో, ఆప్టిక్యూ ఏఐ సేవలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…డాటా సెంటర్ల నుంచి ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లకు డిమాండ్ అధికంగా ఉంటుందన్న అంచనాతో ఈ విభాగంపై దృష్టిసారించినట్టు, ప్రధానంగా అమెరికాలో ఈ డిమాండ్ ఉండటంతో ఇక్కడ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఏడాదికి 39 నుంచి 45 మిలియన్ల ఫైబర్ కిలోమీటర్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన యూనిట్‌ను నెలకొల్పబోతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం కంపెనీ చేతిలో రూ.21 వేల కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయని, అంతక్రితం ఏడాది ఉన్న రూ.9,967 కోట్లతో పోలిస్తే రెండింతలు పెరిగినట్టు చెప్పారు.