Hero Bikes | కొత్తగా బైక్ కొనాలని అనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటాకార్ప్ తమ బైక్స్ ధరలను భారీగా పెంచేసింది. ఒక్కో మోడల్‌పై కనీసం 2 శాతం ధరలను పెంచుతున్నట్లుగా తాజాగా ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ధరలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. కఠిన ఉద్గార నిబంధనల ( Emission Norms ) కారణంగా వాహనాల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకోక తప్పలేదని తెలిపింది.
ప్రస్తుం ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ బీఎస్6 ఫేజ్ 2 ఉద్గార ప్రమాణాలను పాటిస్తూ వాహనాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. అందుకు తగ్గట్లుగా వాహనాల్లో పలు మార్పులు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆన్‌బోర్డ్ డయాగ్నిస్టిక్స్ డివైజ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా మన వాహనాలు ఎంత ఉద్గారాలను విడుదల చేస్తున్నాయో తెలుసుకోవచ్చు. ఇలా ఉద్గార నిబంధనలు కఠినంగా పాటించడం వల్లనే వాహనాల ధరలను పెంచాల్సి వచ్చిందని హీరో మోటాకార్ప్ చెబుతోంది. ఈ నాలుగు నెలల్లో హీరో కంపెనీ తమ వాహనాల ధరలను పెంచడం ఇది రెండోసారి. గత ఏడాది డిసెంబర్లోనే హీరో కంపెనీ తమ బైక్స్ ధరలను పెంచింది.