Hero Electric | దేశీయ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ జెయింట్ హీరో ఎలక్ట్రిక్ సోమవారం సంచలన నిర్ణయం తీసుకున్నది. వినియోగదారులకు త్వరితగతిన ఎలక్ట్రిక్ బైక్లు, స్కూటర్లు అందుబాటులోకి తెచ్చేందుకు రిటైల్ ఫైనాన్స్ వసతి కల్పించనున్నది. ఇందుకోసం ఎల్ అండ్ టీ ఫైనాన్స్ సంస్థతో జత కట్టింది. దేశంలో 750కి పైగా గల డీలర్షిప్ నెట్వర్క్ పరిధిలో ఫైనాన్సింగ్ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.
హీరో ఎలక్ట్రిక్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ మధ్య ఒప్పందం వల్ల వినియోగదారులు ఎటువంటి ఒప్పందం లేకుండానే రుణ సదుపాయం పొందొచ్చు. వాహనాల కొనుగోలు కోసం కేవలం మూడు నిమిషాల్లో రుణానికి ఆమోదం లభిస్తుంది. ఈ రుణాలపై 7.99 శాతం వడ్డీరేటు వసూలు చేస్తారు.
కస్టమర్లకు సుస్థిర మొబిలిటీ ఆప్షన్ కోసం వారికి చౌకగా ఎలక్ట్రిక్ టూవీలర్స్ అందుబాటులోకి తేవడం ఒక కారణం. ద్వితీయ శ్రేణి నగరాలకు మా నెట్వర్క్ విస్తరణ, టూ వీలర్స్ ఓనర్షిప్ సరళతరం చేయడానికి కట్టుబడి ఉన్నాం అని హీరో ఎలక్ట్రిక్ సీఈవో సోహిందర్ గిల్ చెప్పారు. కస్టమర్లు స్వేచ్ఛగా కొనుగోలు నిర్ణయాలు తీసుకునేలా పర్సనలైజ్డ్ ఫండింగ్ ఆప్షన్లను కంపెనీ విస్తరిస్తున్నదన్నారు. పలు బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలతో జత కట్టడం ద్వారా కస్టమర్లకు మెరుగైన సేవలు కల్పించడానికి కట్టుబడి ఉన్నాం అన్నారు.