US Dollar Vs Rupee | అమెరికా డాలర్ కంటే ఇతర కరెన్సీలతో పోలిస్తే రూపాయి విలువ పరిస్థితి మెరుగ్గా ఉందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం విలువ ఆల్‌టైం కనిష్ట స్థాయి రూ.82.68కి పడిపోయింది. ఈ నెల 16 నుంచి అమెరికాలో అధికారిక పర్యటనలో ఉన్న నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ డాలర్ బలోపేతం వల్లే రూపాయి పతనమైందన్నారు. అన్ని కరెన్సీలు కూడా డాలర్ బలోపేతం వల్లే పతనం అవుతున్నాయని చెప్పారు.
ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్‌లో రూపాయి విలువ పతనం కాకుండా ఆర్బీఐ కూడా జోక్యం చేసుకుంటుందని తాను భావిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. కానీ రూపాయి విలువ పతనం కాకుండా ఆర్బీఐ ఫారెక్స్ మార్కెట్లో జోక్యం చేసుకోదన్నారు. రూపాయి అనిశ్చితికి తెర దించేందుకు ఆర్బీఐ మాత్రమే జోక్యం చేసుకోగలదని, తిరిగి తన స్థాయికి చేరుతుందని మీడియాతో అన్నారు.
దేశంలో ద్రవ్యోల్బణం నియంత్రణ దశలోనే ఉందని నిర్మలా సీతారామన్ చెప్పారు. సూక్ష్మ, ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని అన్నారు. భారత్ ఆర్థిక వ్యవస్థ మూలాలు, విదేశీ మారక ద్రవ్య నిల్వలు బాగానే ఉన్నాయని చెప్పారు. భారత్ సౌకర్యవంతమైన పరిస్థితుల్లోనే ఉందని తెలిపారు.