న్యూఢిల్లీ, జూన్ 12: హెల్మెట్లపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను ఎత్తివేయాలని బుధవారం జీఎస్టీ కౌన్సిల్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలను అంతర్జాతీయ రోడ్డు సమాఖ్య (ఐఆర్ఎఫ్) కోరింది. ప్రస్తుతం హెల్మెట్లపై 18 శాతం జీఎస్టీ పడుతున్నది. దీంతో దీన్ని సున్నా (నిల్ లేదా జీరో)కు చేర్చాలని ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. హెల్మెట్ల వాడకాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం దోహదం చేయగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలై ద్విచక్ర వాహనదారులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారన్న ఐఆర్ఎఫ్.. హెల్మెట్లపై జీఎస్టీని తొలగిస్తే వాటి అమ్మకాలు పెరిగి, తద్వారా టూవీలర్ వినియోగదారుల భద్రత కూడా పెరుగుతుందన్నది. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాద మరణాల్లో దాదాపు 12 శాతం భారత్లోనే సంభవిస్తున్నాయని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థను 15.71-38.81 బిలియన్ డాలర్ల మేర నష్టపరుస్తున్నట్టు బాష్ నివేదిక పేర్కొన్నదని ఐఆర్ఎఫ్ గుర్తుచేసింది.