Maternity Insurance | ఆరోగ్య బీమా చేయించారా.. అయితే ప్రసూతి కవరేజీ ఎంతుంటుందో తెలుసుకోవాల్సిందే!
ఇది ఏ సురేశ్కో.. మరే నరేశ్కో మాత్రమే ఎదురైన అనుభవం కాదు. మనలో చాలామంది ఈ తరహా ఇబ్బందులను ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్నవారే మరి. ఆరోగ్య బీమా ఉండటం ఒక్కటే ముఖ్యం కాదు..
Maternity Insurance | కరీంనగర్‌కు చెందిన సురేశ్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. రెండేండ్ల క్రితమే వివాహమైంది.
ఎప్పట్నుంచో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కూడా కడుతున్నాడు. ఈమధ్యే భార్య గర్భవతై నెలలు నిండాయి. తీరా కాన్పు కోసం దవాఖానలో చేరితే.. బీమా వర్తించకపోగా, చేతి నుంచి సుమారు లక్షన్నర దాకా ఖర్చు అయింది.
ఫలితంగా కొత్త కుటుంబ సభ్యులు ఇంట్లోకి అడుగుపెట్టిన ఆనందం కంటే.. ఖర్చులకు కళ్లు తిరిగినంత పనైంది. బీమా ఉంది కదా అనుకున్నారు కానీ.. అందులో వెయిటింగ్ పీరియడ్ గురించి అవగాహన లేకపోవడం సురేశ్‌కు కాస్ట్లీ అనుభవాన్ని తెచ్చిపెట్టింది.
ఇది ఏ సురేశ్కో.. మరే నరేశ్కో మాత్రమే ఎదురైన అనుభవం కాదు. మనలో చాలామంది ఈ తరహా ఇబ్బందులను ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్నవారే మరి. ఆరోగ్య బీమా ఉండటం ఒక్కటే ముఖ్యం కాదు.. అది మన అవసరాలకు తగ్గట్టు ఉందా? లేదా? అనేది అన్నింటికంటే చాలా ప్రధానం. నిజానికి రాష్ట్రంలోని సర్కారీ దవాఖానల్లో ప్రసూతి ఆపరేషన్లు అద్భుతంగా విజయవంతమవుతున్నాయి. వీటికితోడు కేసీఆర్ కిట్లు కూడా ఇస్తుండటంతో పేదలేగాక, పెద్ద ఎత్తున మధ్యతరగతి ప్రజలు కూడా ప్రభుత్వ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. వైద్య చికిత్సలు మెరుగుపడటం, తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్ధి ఇందుకు నిదర్శనం.
మరోవైపు ప్రైవేట్ దవాఖానల్లో డెలివరీ ఖర్చులు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. ఇన్సూరెన్స్ ఉన్నా.. ప్రసూతి కవరేజీ లేకపోతే సున్నానే. ప్రస్తుతం ప్రైవేట్ వైద్యం ఎంత ఖరీదెక్కిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా డెలివరీ కేసుల్లో ఇప్పటికీ చాలామంది ఎందుకనో ప్రైవేట్‌కే మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో పుట్టిన బిడ్డకు ఏదైనా చిన్నపాటి సమస్య ఉన్నాసరే.. ఇక లక్షలకు లక్షల రూపాయలు ఆవిరైపోయే పరిస్థితి.
మెటర్నిటీ కవరేజీ
సాధారణంగా ఆరోగ్య బీమాలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, హాస్పిటలైజేషన్ ఖర్చులు, మెడికల్ ట్రీట్మెంట్, డెలివరీకి ముందు-తర్వాతి ఖర్చులు కవర్ అవుతాయి. వీటితోపాటు గది అద్దె, అంబులెన్స్, సర్జన్ ఫీజు ఉంటాయి. ఇవేగాక ఒకవేళ తల్లికి ఏదైనా సమస్య వస్తే.. డెలివరీ అయ్యాక 90 రోజులదాకా వైద్య ఖర్చులు కూడా కవర్ అవుతాయి. మనం తీసుకునే ప్లాన్, కంపెనీనిబట్టి కొన్ని బీమా సంస్థలు పుట్టిన పిల్లలకూ కొద్ది రోజులపాటు హెల్త్ కవరేజీని ఇస్తున్నాయి. ఈ పసిపిల్లలకు ఏదైనా అనారోగ్యం తలెత్తినా కూడా కొన్ని రోజుల వరకూ హాస్పిటలైజేషన్ ఖర్చులను భరిస్తాయి. ఇంకొన్ని సంస్థలు టీకాల ఖర్చును కూడా ఇస్తాయి. ఏవైనా సరే.. ప్రతీ ఒక్కటీ పాలసీ డాక్యుమెంట్లో క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటుందనే అంశం మనం గుర్తుంచుకోవాలి.
పరిమితులు తెలుసుకోండి
మెటర్నిటీ కవరేజీ కాస్త విచిత్రంగా ఉంటుంది. మనం ఎంత మొత్తం కవరేజీ తీసుకున్నాసరే కొన్ని సంస్థలు గరిష్ఠ మొత్తంలో మాత్రమే ఈ ప్రసూతికి డబ్బులు చెల్లిస్తాయి. లిమిట్స్, సబ్ లిమిట్స్ ఇందులో చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్ని సంస్థలు నార్మల్ డెలివరీకి గరిష్ఠంగా రూ.15-25 వేలు ఇవ్వగా, సి-సెక్షన్‌కు గరిష్ఠంగా రూ.25 నుంచి 50 వేల వరకే ఇస్తున్నాయి. అందుకే మీ పాలసీలో ఏం రాసి ఉందో మీరు బాగా చదువుకోవడం ముఖ్యం. ఎందుకంటే మీరు కార్పొరేట్ దవాఖానలో ఖరీదైన వైద్యం చేయించారనుకుందాం. అప్పుడు దవాఖాన బిల్లుతో సంబంధం లేకుండా పైన చెప్పిన లంప్సమ్ మొత్తం మీ చేతుల్లో పెట్టి చేతులు దులిపేసుకుంటాయి కంపెనీలు.
వెయిటింగ్ పీరియడ్
మొత్తం పాలసీలో అత్యంత ముఖ్యమైనది ఈ అంశమే. సాధారణంగా వివిధ బీమా సంస్థలు మెటర్నిటీ కవరేజీకి కనీసం 9 నెలలు, గరిష్ఠంగా ఐదేండ్ల వెయిటింగ్ పీరియడ్ నిబంధన పెడతాయి. అంటే మీరు పాలసీ తీసుకున్నాక ఈ వెయిటింగ్ పీరియడ్ పూర్తయితేనే మీరు క్లెయిం చేసుకునేందుకు అర్హత లభిస్తుంది. మీకు కొత్తగా పైండ్లె, మీ బీమా సంస్థ ద్వారా కాన్పు ప్రయోజనం పొందాలని అనుకుంటే ఈ వెయిటింగ్ పీరియడ్‌ను కూడా పరిగణనలోకి తీసుకునే ప్లాన్ చేసుకోండి.
సాధారణంగా మెటర్నిటీ కవరేజీకి మూడేండ్ల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అందుకే మీ పెండ్లికి, పిల్లలకు మధ్య ప్లానింగ్ ముఖ్యం. అత్యధిక కేసుల్లో రెండో బేబీకి ఇలాంటి బెనిఫిట్స్ ఎక్కువగా అందుకునే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత త్వరగా పాలసీ తీసుకుంటే మీరు భవిష్యత్తులో ఎక్కువగా ఇబ్బందులు పడే ప్రమాదం తగ్గుతుంది.
పుట్టిన పిల్లలకూ కవరేజీ
అంతా బాగున్నప్పుడు ఓకే.. ఏ సమస్యా ఉండదు. అయితే అప్పుడే పుట్టిన పిల్లల విషయంలో కొన్నిసార్లు చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో ఏదైనా చిన్న కాంప్లికేషన్ వస్తే NICU ఖర్చులు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఒక్కోసారి అండర్ వెయిట్, ప్రీ మెచ్యూర్ డెలివరీ వంటివి కుటుంబాలను మానసికంగానేగాక, ఆర్థికంగా కూడా కుంగదీస్తాయి. అందుకే సాధ్యమైనంత వరకూ అప్పుడే పుట్టిన పిల్లలకూ కవరేజీ ఇచ్చే పాలసీలకు మొదటి ప్రాధాన్యతను ఇవ్వండి. కొన్ని సంస్థలు పిల్లలకు మూడు నెలలు వచ్చేంత వరకూ ఉచితంగానే హాస్పిటలైజేషన్ ట్రీట్మెంట్ ఖర్చులు కవర్ చేస్తున్నాయి.
ప్రీమియంనుబట్టే..
మనం ఎంత ప్రీమియం పెడితే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. రూ.5 లక్షలతో మొదలై రూ.5 కోట్ల వరకూ హెల్త్ ఇన్సూరెన్స్ దొరుకుతున్న రోజులివి. అవసరానికి మించి పాలసీ తీసుకుని, ఏటా భారీ ప్రీమియం కట్టినా ప్రయోజనం ఉండదు. అందుకే మన అవసరాలేవో ముందు గుర్తించి పాలసీని ఎంపిక చేసుకోండి. మనం కట్టే ప్రీమియం ఆధారంగా కొన్ని బీమా సంస్థలు అడుగు ముందుకేసి స్టెమ్ సెల్ ప్రిజర్వేషన్ ఖర్చులను కూడా భరిస్తున్నాయి. హైఫై రూమ్స్, ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్, టెన్షన్ ఫ్రీ డెలివరీ వంటివన్నీ సాధ్యమే.. మనం ఏటా చెల్లించే ప్రీమియం ఆ స్థాయిలో ఉంటే.
గుర్తుంచుకోవాల్సిన అంశాలు
- మెటర్నిటీ కవరేజీ అనేది స్టాండలోన్‌గా ప్రత్యేకించి తీసుకోవడం కుదరదు. హెల్త్ ఇన్సూరెన్స్ ప్యాకేజీలో ఇది ఒక భాగం మాత్రమే.
- బీమాలో కవరేజ్ అయ్యేవి, కానివి ఏవి అనేది కచ్చితంగా పాలసీ డాక్యుమెంట్లో మెన్షన్ చేసి ఉంటుంది.
- గర్భం దాల్చిన తర్వాత మీరు ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం లేదు. ఒకవేళ తీసుకున్నా మీకు క్లెయిం రాదు.
- కొన్ని సంస్థలు గరిష్ఠంగా మహిళలకు 45 ఏండ్లు వచ్చేదాకే మెటర్నిటీ కవరేజీని ఇస్తాయి.
- పాలసీ డాక్యుమెంట్లను పూర్తిగా చదవండి. సబ్ లిమిట్స్, కో-పేమెంట్స్, ఎక్స్‌క్లూజన్స్ గురించి అవగాహన తెచ్చుకోండి.
- మన అవసరాలకు సూటయ్యే ప్రయోజనకర పాలసీని ఎంచుకోవాలి.
- ప్రీమియంను కాకుండా.. పాలసీ బెనిఫిట్స్‌ను గమనించి కొనుగోలు చేయాలి.
-నాగేంద్రసాయి కుందవరం
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

