ముంబై, అక్టోబర్ 15: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర లాభంలో 22 శాతం వృద్ధి నమోదైంది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడంతో గడిచిన త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.11,125.21 కోట్ల కన్సాలిటేడ్ లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.9,096.19 కోట్ల లాభాన్ని గడించింది. బ్యాంక్ ఆదాయం రూ.38,754 కోట్ల నుంచి రూ.46,182 కోట్లకు ఎగబాకినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. ఏకీకృత విషయానికి వస్తే బ్యాంక్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 20 శాతం అధికమై రూ.10,605.78 కోట్లుగా నమోదైంది. కోర్ నికర వడ్డీ ఆదాయం 18.9 శాతం అధికమై రూ.21,021 కోట్లు వసూలయ్యాయి.