ముంబై, అక్టోబర్ 5: దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. ఫెస్టివ్ ట్రీట్స్ 3.0ను మంగళవారం ప్రకటించింది. ఇందులో భాగంగా కార్డులు, రుణాలు, సులభతరమైన ఈఎంఐలపై 10 వేలకుపైగా ఆఫర్లను తీసుకొచ్చింది. ఈ డీల్ కింద అన్ని వర్గాల కోసం మెగా డిస్కౌంట్లను అందుబాటులో ఉంచింది. రిటైల్ కస్టమర్లు ఖరీదైన స్మార్ట్ఫోన్ కావాలనుకున్నా.. ఔత్సాహిక వ్యాపారవేత్తలు మూలధనం సమకూర్చుకోవాలనుకున్నా.. రైతులు కొత్త ట్రాక్టర్ కొనుక్కోవాలనుకున్నా.. అందరి కోసం అన్ని రకాల ఆఫర్లను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ సందర్భంగా పరిచయం చేయడం విశేషం. ఇందుకోసం 100కుపైగా నగరాలు, పట్టణాల్లోని 10 వేలకుపైగా వ్యాపారులతో బ్యాంక్ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నది. యాపిల్, అమెజాన్, షాపర్స్ స్టాప్, ఎల్జీ, సామ్సంగ్, సోనీ, టైటాన్, సెంట్రల్, ఏజియో, రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ ట్రెండ్స్, లైఫ్ైస్టెల్ వంటి జాతీయ వ్యాపార భాగస్వాములతోపాటు విజయ్ సేల్స్, పోతీస్, డిజీవన్, చెన్నై సిల్క్స్, జీఆర్టీ జ్యుయెల్లర్స్, ఫోన్వాలే, సర్గమ్ ఎలక్ట్రానిక్స్, పూర్విక మొబైల్స్, ఎలక్ట్రానిక్ ప్యారడైజ్ వంటి ప్రాంతీయ బ్రాండ్లతో జత కట్టింది. మొత్తంగా వ్యక్తిగత, వ్యాపార అవసరాలకు మా ఈ ఆఫర్లు ఎంతగానో దోహదం చేస్తాయని ఈ సందర్భంగా బ్యాంక్ తెలియజేసింది.