ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థలు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు క్రెడిట్ కార్డులపై చార్జీలను సవరిస్తున్నాయి. కార్డ్ యూసేజ్, బ్యాంకింగ్ సర్వీసెస్ చార్జీలు వచ్చే నెల జూలై 1 నుంచి మారుతాయని ఆయా బ్యాంకులు అధికారికంగా ప్రకటించాయి.
డ్రీమ్11, రమ్మీ కల్చర్, జంగ్లీ గేమ్స్ లేదా ఎంపీఎల్ వంటి ఆన్లైన్ నైపుణ్య ఆధారిత గేమింగ్ వేదికలపై నెలకు రూ.10 వేలకు మించి క్రెడిట్ కార్డు యూజర్లు వెచ్చిస్తే మొత్తం నెలవారీ ఖర్చుపై 1 శాతం ఫీజు పడుతుంది. అయినప్పటికీ ఒక నెలకుగాను ఈ చార్జీకి గరిష్ఠ పరిమితి రూ.4,999. అలాగే ఈ గేమింగ్ లావాదేవీలకు ఎటువంటి రివార్డ్ పాయింట్లూ ఉండవు.
పేటీఎం, మొబీక్విక్, ఫ్రీచార్జ్ లేదా ఓలా మనీ వంటి థర్డ్‌పార్టీ వ్యాలెట్లలోకి నెలలో రూ.10 వేలకు మించి క్రెడిట్ కార్డు వినియోగదారులు పంపితే ఆ మొత్తంపై నెలకు రూ.4,999 దాటకుండా 1 శాతం చార్జీ వర్తిస్తుంది.
క్రెడిట్ కార్డుల ద్వారా యుటిలిటి బిల్లుల చెల్లింపులు నెలకు రూ.50,000 దాటితే రూ.4,999 మించకుండా 1 శాతం చార్జీ పడుతుంది. అయితే బీమా పాలసీ చెల్లింపులను యుటిలిటీ బిల్ పేమెంట్స్‌గా పరిగణించబోమని బ్యాంక్ తెలిపింది. కాబట్టి వీటికి ఈ చార్జీలు వర్తించవు.
అద్దె, ఇంధనం, చదువుల ఫీజులకు క్రెడిట్ కార్డులను వినియోగిస్తే ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.4,999 చార్జీ పడనున్నది. పైగా అద్దె చెల్లింపులపై ఇప్పుడున్న 1 శాతం ఫీజు కూడా మారదు. ఇక ఇంధన లావాదేవీలు రూ.15,000 దాటితే 1 శాతం ఫీజు ఉంటుంది. అయితే కళాశాల, పాఠశాల అధికారిక వెబ్సైట్ల ద్వారా లేదా వారి కార్డ్ మెషీన్లపై నేరుగా చేసే చెల్లింపులకు చార్జీలు పడవు.
నగదు, చెక్కులు, డీడీలు, పీవో లావాదేవీలకు కస్టమర్లు క్రెడిట్ కార్డులను వాడితే రూ.1,000కి రూ.2 చొప్పున కనీసం రూ.50, గరిష్ఠంగా రూ.15,000 చార్జీలుంటాయి. ప్రస్తుతం రూ.10 వేలదాకా రూ.50, రూ.1,000 దాటితే రూ.5 చార్జీగా బ్యాంక్ వసూలు చేస్తున్నది.
ఏటీఎం వినియోగ చార్జీలూ పెరుగుతున్నాయి. ఇతర బ్యాంక్ ఏటీఎంల్లో ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు నెలకు మూడుసార్లు ఉచితంగా లావాదేవీలు చేసుకోవచ్చు. ఇది దాటితే ఒక్కో ఆర్థిక లావాదేవీకి రూ.23 (ప్రస్తుతం రూ.21) చొప్పున, ఆర్థికేతర లావాదేవీకి రూ.8.5 చొప్పున చార్జీ ఉంటుంది. ఇక ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎంల్లో ఆ బ్యాంక్‌కు చెందిన రెగ్యులర్ సేవింగ్స్ ఖాతాదారులు నెలకు 5 ఆర్థిక లావాదేవీలు దాటితే ఒక్కో దానికి రూ.23 (ప్రస్తుతం రూ.21) చొప్పున చార్జీని చెల్లించాల్సి ఉంటుంది.
ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డులకు వార్షిక చార్జీ రూ.200 నుంచి రూ.300కు పెరిగింది. కార్డుపోతే కొత్త కార్డు రావాలన్నా తీసుకునే చార్జీ రూ.200 నుంచి రూ.300కు పెంచారు.