Shiv Nadar | ముంబై, నవంబర్ 7: దేశీయ కుబేరుల్లో ఒకరైన హెచ్సీఎల్ టెక్నాలజీ చైర్మన్ శివ్ నాడర్ దాతృత్వంలో మరోసారి సత్తాచాటారు. రోజుకు రూ.5.9 కోట్ల చొప్పున 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,153 కోట్లు విరాళ రూపంలో చెల్లింపులు జరిపారు. ఎడల్గివ్-హురున్ ఇండియా ఫిలంథ్రోపీ విడుదల చేసిన దేశీయ జాబితా ద్వారా ఈ విషయం వెల్లడైంది. అంతక్రితం ఏడాది ఇచ్చిన విరాళం కంటే ఇది ఐదు శాతం అధికమని పేర్కొంది. అలాగే ఇతర దేశీయ శ్రీమంతులుగా వెలుగొందుతున్న గౌతమ్ అదానీ, ముకేశ్ అంబానీలు శివ్ నాడర్ కంటే చాలా దూరంలో నిలిచారు.
గడిచిన ఆర్థిక సంవత్సరంలో గౌతమ్ అదానీ కేవలం రూ.330 కోట్లు విరాళం ఇవ్వగా, ముకేశ్ అంబానీ రూ.407 కోట్లతో సరిపెట్టుకున్నారు. బజాజ్ కుటుంబం ర్యాంక్ మూడు స్థానాలు ఎగబాకి మూడో స్థానానికి చేరుకోగా, కుమారమంగళం బిర్లా అండ్ ఫ్యామిలీ నాలుగో స్థానంలో నిలిచారు.