న్యూఢిల్లీ, జూలై 12: ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.4,257 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన లాభంతో పోలిస్తే 20.4 శాతం వృద్ధిని కనబరిచింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 6.6 శాతం వృద్ధితో రూ.28,057 కోట్లు ఆర్జించింది. అంచనావేసిన దానికంటే అధికంగానే ఆర్థిక ఫలితాలు నమోదయ్యాయని కంపెనీ సీఈవో సీ విజయకుమార్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయంలో వృద్ధి 3-5 శాతమని గైడెన్స్‌లో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.12 లేదా 600 శాతం మధ్యంతర డివిడెండ్‌ను సంస్థ ప్రకటించింది.