Gold | న్యూఢిల్లీ, మే 16: మన ఇండ్లలో ఎంతో కొంత బంగారం ఉంటుంది. అయితే ఎంత ఉంచుకోవాలన్నదానికీ కొన్ని పరిమితులున్నాయని మీకు తెలుసా? ఆదాయ పన్ను (ఐటీ) శాఖ నిబంధనలు ఏం చెప్తున్నాయి?
భారత్లో బంగారం.. ఓ ఆభరణం, పెట్టుబడి సాధనం మాత్రమే కాదు అంతకు మించిన గౌరవం. చాలామంది దీన్ని దైవంగా కూడా కొలుస్తారు. లక్ష్మీదేవి అవతారం అంటూ ఇనప్పెట్టెల్లో దాచేస్తారు. అయితే మన దగ్గరుందికదా అని ఎంతంటే అంత ఇండ్లల్లో పెట్టుకోవడం కుదరదంటోంది ఐటీ శాఖ. నిజానికి ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పరిమితుల్నీ విధించలేదు. కానీ ఐటీ శాఖ అధికారులు జరుపుతున్న సోదాల్లో పట్టుబడుతున్న పుత్తడిపై ఆదాయ పన్ను చెల్లింపుదారులకు, ఆదాయ పన్ను శాఖకు మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. చివరకు మహిళలు ధరించిన నగల్నీ అధికారులు తీసేసుకుంటున్నారన్న ఆరోపణలుంటున్నాయి. దీంతో మన దగ్గర చట్టప్రకారం ఎంత ఉండాలి? అన్న ప్రశ్నలు ఇటీవలికాలంలో తరచూ అందరిలో తలెత్తుతున్నాయి. అయితే 1994లో ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం పరిమితికి లోబడి ఉన్న బంగారం జోలికి ఐటీ సోదాల్లో ఏ అధికారీ వెళ్లకూడదు.
పైండ్లెన మహిళకు 500 గ్రాముల (అరకిలో లేదా 50 తులాలు) వరకు బంగారం ఉండొచ్చు. పెండ్లికాని మహిళలకు మాత్రం 250 గ్రాముల (పావుకిలో లేదా 25 తులాలు)కు మించి బంగారం ఇంట్లో ఉండరాదు. ఇక మగవారికి ఈ పరిమితి 100 గ్రాములే (10 తులాలు). ఐటీ సోదాల్లో ఈ మేరకు ఆయా వ్యక్తులకు సంబంధించిన పసిడి దొరికితే అధికారులు వదిలేయాలి. ఈ పుత్తడికి ఎలాంటి ధ్రువపత్రాలు లేకపోయినా దాని జోలికి పోరాదు. కాగా, ఈ పరిమితులు కేవలం ఆభరణాల రూపంలో ఉన్న బంగారానికే వర్తిస్తాయి. బిస్కట్లు, కడ్డీల రూపంలో ఉన్న బంగారానికి సంబంధించి ఈ సర్క్యులర్లో సీబీడీటీ ఏ సూచనలూ చేయలేదు.
ఒకవేళ ఎవరికైనా తమ తాత, ముత్తాతల నుంచి వంశపారంపర్యంగా, వారసత్వ సంపదగా పెద్ద ఎత్తున బంగారు అభరణాలు వస్తే దానికి సంబంధించి ఓ చిన్న నిబంధన ఉన్నది. అప్పుడు అందుకు సంబంధించిన రుజువులు చూపాల్సి ఉంటుంది. సదరు సాక్ష్యాలు సరైనవేనని తేలితే ఆ నగలను ఐటీ అధికారులు సీజ్ చేయరు. లేకుంటే జప్తు చేస్తారు. అయినప్పటికీ ఆ తర్వాత కూడా వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలను చూపి వాటిని విడిపించుకోవచ్చు. ఇదిలావుంటే పట్టుబడిన బంగారం పరిమితులకు లోబడి ఉన్నా.. దర్యాప్తు సమయంలో అధికారులు వాటి ధ్రువపత్రాలను చూపాలని కోరుతున్నట్టు పలువురు ట్యాక్స్పేయర్స్ చెప్తున్నారు. అయితే ఇలాంటప్పుడు నిపుణుల సాయంతో రూల్స్ ప్రకారం వెళ్లి మీ బంగారాన్ని మీరు తీసుకోవడానికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మరువద్దు.