హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): హెచ్ఎస్బీసీ సహకారంతో ఈనెల 21న టీహబ్‌లో హ్యాకథాన్‌ను నిర్వహించబోతున్నారు. ఇంజనీరింగ్, కోడింగ్ అంశాలపై ఔత్సాహికులకు ఉదయం 9-రాత్రి 9 గంటల వరకు హ్యాకథాన్‌ను నిర్వహించనున్నట్లు టీహబ్ ప్రతినిధి ఒకరు తెలిపారు. మరిన్ని వివరాలకు ఈ లింకు (https://bit.ly/ 4d9 naxb)లో సంప్రదించాలని సూచించారు. విజేతలుగా ఎంపికైన వారికి హెచ్ఎస్బీసీలో ఇంటర్న్‌షిప్‌కు అవకాశం ఉంటుంది.
ఫెడరల్ బ్యాంక్ విస్తరణ
హైదరాబాద్, ఆగస్టు 8: ఫెడరల్ బ్యాంక్ తెలుగు రాష్ర్టాల్లో మరిన్ని శాఖలు ఏర్పాటుచేయబోతున్నది. ప్రస్తుతం తెలంగాణ, ఏపీల్లో 78 శాఖలు ఉండగా, వచ్చే ఏడాదిన్నరలోగా ఈ శాఖల సంఖ్యను 100కి పెంచుకోనున్నట్లు బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, జోనల్ హెడ్ దిలీప్ తెలిపారు. ప్రస్తుతేడాది 10 నుంచి 12 శాఖలను ప్రారంభించనుండగా, వచ్చే ఏడాది కూడా ఇంతే స్థాయిలో బ్రాంచ్‌లను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు హైదరాబాద్‌లోకి అడుగుపెట్టి 50 ఏండ్లు పూర్తైన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన చెప్పారు.
నైనీబ్లాకులో చెట్ల గణన
హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): ఒడిశాలో నైనీ బ్లాక్‌లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించడానికి వీలుగా చెట్ల గణన, తొలగింపు ప్రక్రియకు సహకరించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ అహూజాను సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ కోరారు. 10 రోజుల్లో చెట్ల గణన ప్రక్రియ చేపడతామని ఆయన హామీ ఇచ్చినట్టు సీఎండీ వెల్లడించారు. బుధవారం భువనేశ్వర్‌లో కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో కొత్త బ్లాక్‌ల స్థితిగతులపై నిర్వహించిన సమావేశంలో సీఎండీ మాట్లాడారు.