న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19 : విద్యుత్ పరికరాల ఉత్పత్తిలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థయైన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జీఎస్టీ మార్గదర్శకాలకు లోబడి తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రూ.586.43 కోట్ల షోకాజ్ నోటీసును జారీ చేసింది.
2021-22 నుంచి 2023-24 వరకు మూడేండ్లపాటు వార్షిక జీఎస్టీ రిటర్ను, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కు సంబంధించి సీజీఎస్టీ, టీజీఎస్టీ చట్టం-2017 ప్రకారం అసిస్టెంట్ కమిషనర్ ఈ నెల 18న నోటీసును పంపించారు. మూడు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన జీఎస్టీ వార్షిక రాబడి, ఆర్థిక నివేదికల ఆధారంగా నోటీసులు ఇచ్చినట్టు కంపెనీ స్టాక్ ఎక్సేంజ్కు సమాచారం అందించింది. దీంట్లో 2021-22లో రూ.184.55 కోట్లు, 2022-23లో రూ.207.26 కోట్లు, 2023-24లో రూ.194.62 కోట్ల నోటీసును జారీ చేశారు.