GST | దేశీయంగా రోజురోజుకు జీఎస్టీ వసూళ్లు పెరుగుతున్నాయి. 2022 జూన్ నెలతో పోలిస్తే గత నెలలో జీఎస్టీ వసూళ్లలో 12 శాతం వృద్ధిరేటు నమోదైంది. గత నెలలో రూ.1,61,497 కోట్ల స్థూల జీఎస్టీ వసూళ్లు జరిగాయని కేంద్ర ఆర్థికశాఖ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.
స్థూల జీఎస్టీ వసూళ్లలో సీజీఎస్టీ రూ.31,013 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.38,292 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.80,292 కోట్లు (వస్తువుల దిగుమతిపై రూ.39,035 కోట్లతోపాటు), సెస్ రూ.11,900 కోట్లు (రూ.1,028 కోట్ల దిగుమతి సుంకంతోపాటు) వసూలయ్యాయి. ఐజీఎస్టీ నుంచి కేంద్రం రూ.36,224 కోట్లు సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ కింద రూ.30,269 కోట్లు కేటాయించింది. జూన్ నెల జీఎస్టీలో కేంద్రానికి రూ.67,237 కోట్లు, రాష్ట్రాలకు రూ.68,561 కోట్లుగా సెటిల్ చేసినట్లు ఆర్థికశాఖ వెల్లడించింది.
సేవల దిగుమతి ద్వారా దేశీయ లావాదేవీల నుంచి 2022తో పోలిస్తే గత నెలలో 18 శాతం ఎక్కువ రెవెన్యూ లభించింది. వరుసగా నాలుగో నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్లు దాటాయి. 2021-22 తొలి త్రైమాసికంలో సగటున రూ.1.10 లక్షల కోట్లు, 2022-23 తొలి త్రైమాసికంలో రూ.1.51 లక్షల కోట్లు, 2023-24 తొలి త్రైమాసికంలో రూ.1.69 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి.