న్యూఢిల్లీ, అక్టోబర్ 8 : వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అధికారులకున్న అరెస్ట్ పవర్ రైద్దెంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాష్ర్టాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ 57వ సమావేశం గురువారం ఇక్కడ జరిగింది. ఈ సందర్భంగా ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్, జీఎస్టీ నమోదు సరళతరానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ సంస్కరణలు అమల్లోకి రానున్నాయని మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంత్రి సీతారామన్ తెలిపారు. కాగా, జీఎస్టీ అధికారులకున్న అరెస్ట్ పవర్‌ను కౌన్సిల్ తొలగించింది. 2017లో జీఎస్టీని అమల్లోకి తెస్తున్నప్పుడు ఎక్సైజ్‌లో మినహా వ్యాట్, సర్వీస్ ట్యాక్స్ మిగతా ఏ పన్ను చట్టంలోనూ లేని అరెస్ట్ పవర్‌ను ఈ పన్ను అధికారులకిచ్చారు. అయితే అప్పట్లో వ్యవస్థీకృత లోపాలను అడ్డం పెట్టుకుని నకిలీ ఇన్వాయిస్లు, పన్ను ఎగవేతలు జరిగేవి. కానీ ఇప్పుడు జీఎస్టీ సిస్టమ్ ఎంతో పకడ్బందీ అయ్యిందని, అందుకే జీఎస్టీ అధికారులకున్న అరెస్ట్ అధికారాన్ని తొలగించాలన్న నిర్ణయానికి కౌన్సిల్ వచ్చింది. ఇకపై అధికారులు పన్ను వసూళ్ల బాధ్యత చూసుకుంటే చాలని, నేరగాళ్ల పనిని లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు వదిలేయాలన్న అభిప్రాయాలు సైతం కౌన్సిల్ నిర్ణయాన్ని ప్రభావితం చేశాయంటున్నారు.
రూ.5 కోట్లు, ఆపై పన్ను ఎగవేత కేసుల్లోనే క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఉంటుందని జీఎస్టీ కౌన్సిల్ స్పష్టం చేసింది. మునుపు దీనికున్న పరిమితి కోటి రూపాయలుగా ఉన్నది. అలాగే జనరల్ పెనాల్టీని రూ.25,000 నుంచి రూ.10,000కు తగ్గించారు. రూ.10,000, ఆలోపున్న పన్ను బకాయిలకు జీఎస్టీ నోటీసులను తొలగించడమేగాక, ఇప్పటిదాకా వచ్చినవాటిని వెనక్కి తీసుకోవడానికి కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. ఇక చాలా క్లెయిముల్లో రిఫండ్స్‌ను వేగంగా కేవలం 3 రోజుల్లోనే చెల్లిస్తామని ప్రకటించింది. కాగా, ‘వ్యాపారాలను విశ్వసించాలి. పన్ను చెల్లింపుదారులనూ నమ్మాలి. విశ్వసనీయంగా వ్యాపారాలు జరుగుతున్నప్పుడు మరీ ఎక్కువగా జోక్యం చేసుకోవద్దు. జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా 99 శాతం సమస్యలను పరిష్కరించాం’ అని ఈ సందర్భంగా మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అయితే ఈ సమావేశంలో పన్ను రేట్లు, స్లాబులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఇక వేగవంతమైన నిర్ణయాలకు ఈ జీఎస్టీ సంస్కరణలు అద్దం పడుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. జీఎస్టీని మరింత ప్రభావవంతంగా, పారదర్శకంగా, జనహితంగా చేయడమే తమ ఉద్దేశమన్నారు.

బంగారం, వెండి, ప్లాటినమ్ దిగుమతి చేసుకుంటే నిర్దేశిత బ్యాంకులు, నామినేటెడ్ ఏజెన్సీలకూ 3 శాతం ఐజీఎస్టీ పడుతుందని రెవిన్యూ కార్యదర్శి అర్వింద్ శ్రీవాత్సవ తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే ఈ నిర్ణయం వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. దీంతో బులియన్ సహా ఇతర ఏ మార్గాల ద్వారా దేశంలోకి దిగుమతైనా గోల్డ్, సిల్వర్, ప్లాటినమ్లపై పడుతున్న పన్ను సమానంగానే ఉంటుందన్నారు. అయితే ఇప్పటికే బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి, ప్లాటినమ్పై 6.4 శాతం నుంచి 15.4 శాతానికి కేంద్రం పెంచిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం బులియన్ మార్కెట్లో పుత్తడి, వెండి ధరలను మరింతగా ఎగదోయనున్నది. తొలుత జ్యుయెల్లర్స్పై, తర్వాత కొనుగోలుదారులపై భారం పడుతుందని అంటున్నారు. రాబోయే పండుగ సీజన్లో గోల్డ్ మార్కెట్‌కు ఇది ఇబ్బందేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి పెరిగిన ముడి చమురు ధరలతో కరిగిపోతున్న ఫారెక్స్ రిజర్వులను కాపాడుకోవడానికి పసిడి కొనుగోళ్లకు ఏడాదిపాటు దూరంగా ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చినది తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే ఇప్పుడు నిర్ణయం వెలువడింది.