GST | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై 18 శాతం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేటు ఎత్తివేత/తగ్గింపు దిశగా అడుగులు పడ్డాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సోమవారం నిర్వహించిన 54వ సమావేశంలో సాధ్యాసాధ్యాలపై ఓ కమిటీని వేయాలని నిర్ణయించింది. బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌధరి అధ్యక్షతన ఈ మంత్రులతో కూడిన కమిటీ ఉంటుంది. వచ్చే నెలాఖర్లోగా ఈ కమిటీ తమ నివేదికను సమర్పించనున్నది. నవంబర్‌లో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
5 శాతమే పన్ను
క్యాన్సర్ ఔషధాలు, వివిధ రకాల మిక్చర్ (నమ్కీన్స్)పై జీఎస్టీని తగ్గిస్తూ తాజా భేటీలో జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నది. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు వాడే మందులపై ప్రస్తుతం పడుతున్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు. ఇంతకుముందు ఇది 12 శాతంగా ఉన్నది. అలాగే నమ్కీన్స్పై జీఎస్టీని కూడా 18 శాతం నుంచి 12 శాతానికి తెచ్చారు. ఇదిలావుంటే 2026 మార్చి తర్వాత ముగిసిపోనున్న నష్టపరిహార సెస్సుకు సంబంధించి వస్తున్న ఆందోళనల పరిష్కారానికీ ఓ మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ చెప్తున్నారు. అలాగే జీఎస్టీ రేటు హేతుబద్ధం, ఆన్లైన్ గేమింగ్‌పై మంత్రుల కమిటీ నివేదికలపైనా చర్చించారు. అయితే ఆన్లైన్ గేమింగ్‌పై 28 శాతం జీఎస్టీ విధించిన దగ్గర్నుంచి పన్ను వసూళ్లు 412 శాతం పెరిగినట్టు మంత్రి సీతారామన్ చెప్పారు. నిరుడు అక్టోబర్ 1న ఈ పన్ను వేసిన విషయం తెలిసిందే.
మరికొన్నింటిపై..
తీర్థయాత్రలకు వినియోగించే హెలికాప్టర్ సర్వీసులపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించినట్టు ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి ప్రేమ్ చంద్ అగర్వాల్ తెలిపారు. ఇంతకుముందు ఇది 18 శాతంగా ఉండేది. మరోవైపు పరిశోధనల కోసం మంజూరు చేసే నిధులపై జీఎస్టీని ఎత్తివేసినట్టు ఢిల్లీ ఆర్థిక మంత్రి అతిషి తెలిపారు. ఇక విదేశీ విమానయాన సంస్థల ఆధ్వర్యంలో నడిచే కంపెనీల ద్వారా జరిగే దిగుమతి సర్వీసులపైనా జీఎస్టీని ఎత్తివేయాలని నిర్ణయించినట్టు రెవిన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా వెల్లడించారు.