GST Collections | ఆర్థిక వృద్ధిరేటు పునరుద్ధరణకు సంకేతంగా దేశీయ వినియోగం పెరగడంతో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఫిబ్రవరి నెల జీఎస్టీ వసూళ్లలో 9.1 శాతం వృద్ధిరేటు నమోదై రూ.1.84 లక్షల కోట్లకు చేరాయి. మొత్తం జీఎస్టీ వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ రూ.35,204 కోట్లు అని శనివారం కేంద్ర ఆర్థికశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర జీఎస్టీ (ఎస్జీఎస్టీ) రూ.43,704 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) రూ. 90,870 కోట్లు ఉంటుంది. సెస్ రూపంలో రూ.13,868 కోట్లు వసూలైంది. దేశీయ లావాదేవీల ద్వారా జీఎస్టీ ఆదాయం 10.2 శాతం వృద్ధి చెంది రూ.1.42 లక్షల కోట్లకు చేరుకోగా, విదేశాల నుంచి దిగుమతులు 5.4శాతం పుంజుకుని రూ.41,702 కోట్లుగా నిలిచాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గత నెలలో జీఎస్టీ రీఫండ్స్ 17.3శాతం వృద్ధితో రూ.20,889 కోట్లకు చేరాయి.
ఫిబ్రవరిలో నికర జీఎస్టీ వసూళ్లు 8.1 శాతం పెరిగి సుమారు రూ. 1.63 లక్షల కోట్ల వద్ద స్థిర పడ్డాయి. గతేడాది (2024) ఫిబ్రవరి స్థూల జీఎస్టీ వసూళ్లు రూ. 1.68 లక్షల కోట్లు, నికర జీఎస్టీ వసూళ్లు రూ. 1.50 లక్షల కోట్లుగా రికార్డయ్యాయి. గత నెలలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.1.84 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అయినా 2025 జనవరిలో వసూలైన జీఎస్టీ ఆదాయం రూ.1.96 లక్షల కోట్లతో పోలిస్తే గత నెల జీఎస్టీ వసూళ్లు తక్కువే. అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను తట్టుకుని జీఎస్టీ వసూళ్లు పెరగడం దేశీయ ఆర్థిక వృద్ధి పురోభివృద్ధికి సంకేతం అని భావిస్తున్నారు. విదేశాల నుంచి దిగుమతిపై వచ్చే ఐ-జీఎస్టీతో పోలిస్తే, దేశీయ లావాదేవీలతో వస్తున్న జీఎస్టీ ఆదాయం నికరంగా పెరుగుతున్నది.