GST Collections | డిసెంబర్ నెలలో జీఎస్టీ చెల్లింపులు రూ.1.77 లక్షల కోట్లకు చేరుకున్నాయి. వరుసగా పదో నెల జీఎస్టీ వసూళ్లు రూ.1.7 లక్షల కోట్ల మార్కును దాటాయని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. 2023 డిసెంబర్ నెలతో పోలిస్తే గత నెలలో జీఎస్టీ వసూళ్లు 7.3 శాతం వృద్ధి చెందాయి. 2023 డిసెంబర్లో రూ.1.65 లక్షల కోట్ల వసూళ్లు జరిగాయి. కానీ, 2024 ఏప్రిల్లో జీఎస్టీ వసూళ్లు రూ.2.1 లక్షల కోట్లు, నవంబర్ వసూళ్లు రూ.1.82 లక్షల కోట్ల కంటే తక్కువే. ఏడాది ప్రాతిపదికన 8.5 శాతం జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. దేశీయంగా జీఎస్టీ వసూళ్లు 8.4 శాతం పెరిగి రూ.1.32 లక్షల కోట్లు నమోదయ్యాయి. వస్తువుల దిగుమతిపై పన్ను ఆదాయం సుమారు నాలుగు శాతం పెరిగి రూ.44,268 కోట్లకు చేరుకున్నది.
సెంట్రల్ జీఎస్టీ వసూళ్లు రూ.32,836 కోట్లు, స్టేట్ జీఎస్టీ వసూళ్లు రూ.40,499 కోట్లు, ఇంటిగ్రేటెడ్ ఐజీఎస్టీ వసూళ్లు రూ.47,783 కోట్లు, సెస్ రూ.11,471 కోట్లు వసూలు అయ్యాయి. అంతకు ముందు నవంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.81 లక్షల కోట్లు (8.5 శాతం వృద్ధి) నమోదైంది. 2024 ఏప్రిల్ నెలలో రూ.2.10 లక్షల కోట్ల తర్వాత నవంబర్ నెల జీఎస్టీ వసూళ్లు అత్యధికం. ఇక డిసెంబర్ నెలలో జీఎస్టీ రీఫండ్స్ రూ.22,490 కోట్లు చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. 2023 డిసెంబర్ తో పోలిస్తే 31 శాతం ఎక్కువ. రీఫండ్స్ సర్దుబాటుతో డిసెంబర్ నెలలో నికర జీఎస్టీ వసూళ్లు 3.3 శాతం వృద్ధితో రూ.1.54 లక్షల కోట్లకు చేరుకున్నాయి.