న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: బంగారు ఆభరణాల విక్రయ దిగ్గజాల్లో ఒకటైన జీఆర్టీ జ్యువెల్లరీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్..త్రిభోవన్దాస్ భీమ్జీ జవేరీ లిమిటెడ్(టీబీజెడ్)లో హస్తగతం చేసుకోవడానికి సిద్ధమైంది. తొలి దశలో భాగంగా 74.12 శాతం మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. ఒప్పందం విలువ రూ.1,033.71 కోట్లు. షేరు కొనుగోలు ఒప్పందానికి నియంత్రణ మండళ్లు, సాధారణ ముగింపు షరతులకు లోబడి జరిగిందని ఇరు సంస్థలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. సెబీ నిబంధనల ప్రకారం జీఆర్టీ మరో 26 శాతం వాటాను బహిరంగ ఆఫర్(ఓపెన్ ఆఫర్) కూడా ప్రారంభించింది. ఈ సందర్భంగా జీఆర్టీ జ్యువెల్లర్స్ ఇండియా ఎండీ జీఆర్ అనంత్ అనంతపద్మనాభన్ మాట్లాడుతూ..దేశవ్యాప్తంగా బంగారు ఆభరణాల విక్రయ వ్యాపారాన్ని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో టీబీజెడ్లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసినట్టు, తద్వారా కంపెనీకివున్న 37 స్టోర్లు దోహదం చేయనున్నాయన్నారు.