Crypto Bill | క్రిప్టో కరెన్సీ బిల్లును వచ్చే బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల్లోనూ ప్రభుత్వం ప్రవేశ పెట్టకపోవచ్చునని తెలుస్తున్నది. క్రిప్టో కరెన్సీల నియంత్రణకు ఫ్రేమ్‌వర్క్ రూపకల్పనలో ఏకాభిప్రాయాన్ని సాధించడానికి మరింత సంప్రదింపులు జరుపాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. కొన్ని నెలల్లో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రయోగాత్మకంగా ప్రారంభించే డిజిటల్ కరెన్సీ కోసం కేంద్ర ప్రభుత్వం వేచి ఉండాలని కోరుకుంటుందని సమాచారం.
గత నెలలో సమావేశమైన ఆర్బీఐ గవర్నింగ్ బాడీ సమావేశంలోనూ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ), ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలు తదితర అంశాలపై వివిధ కోణాల్లో చర్చించినట్లు తెలుస్తున్నది. క్రిప్టో కరెన్సీల విధాన నిర్ణయంలో కీలకమయ్యే భాగస్వాములందరితో మరింతగా చర్చలు జరిపాకే బిల్లు తేవాలని కేంద్ర ఆర్థికశాఖ భావిస్తున్నట్లు ఆ శాక వర్గాలు తెలిపాయి.
బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల్లో క్రిప్టోబిల్లును ప్రవేశపెట్టకపోవచ్చు. ఇది సంక్లిష్టమైన సబ్జెక్ట్. దీనికి మరింత టైం పడుతుంది అని సీనియర్ ఆర్థికశాఖ అధికారి పేర్కొన్నట్లు సమాచారం. డిజిటల్ కరెన్సీల ఫ్రేమ్ వర్క్ ఖరారు చేయడానికి ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలకు కూడా సవరణలు తేవాల్సిన అవసరం ఉంది. ఆర్బీఐ అధికారికంగా విడుదల చేసే డిజిటల్ కరెన్సీ ఆవిష్కరణ తర్వాత వచ్చే టెక్నికల్ ఫీడ్ బ్యాక్ కోసం నార్త్‌బ్లాక్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.
దేశ సూక్ష్మ ఆర్థిక, ద్రవ్య సుస్థిరత అంశాలకు ప్రైవేట్ వర్చువల్ కరెన్సీలతో ముప్పని ఇంతకుముందు ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డిజిటల్ కరెన్సీ బిల్లు-2021ను పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి కేంద్రం లిస్టింగ్ చేసింది. కానీ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టలేదు. క్రిప్టో అసెట్లపై పన్నుల వ్యవస్థ రూపకల్పనపై ఏకాభిప్రాయం రాకపోవడంతోనే బిల్లు పార్లమెంట్‌కు రాలేదని సమాచారం.
2022 బడ్జెట్లో వర్చువల్ కరెన్సీలు.. అంటే క్రిప్టో కరెన్సీల్లో ఇన్వెస్టర్లపై పన్ను విధానంపై ఆర్థిక శాఖ కొంత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. క్రిప్టో కరెన్సీ పరిశ్రమపై పూర్తిస్థాయి టాక్సేషన్ ఫ్రేమ్‌వర్క్ ఇంకా రూపకల్పన దశలోనే ఉందని ఆర్థికశాఖ వర్గాల కథనం. టాక్స్ ఎక్స్పర్ట్స్ నుంచి క్రిప్టో కరెన్సీ లావాదేవీల పట్ల, వాటి నియంత్రణ పట్ల తీసుకోవాల్సిన చర్యలపై నార్త్‌బ్లాక్.. ఇన్పుట్స్ కోరినట్లు సమాచారం. వివిధ భాగస్వాముల నుంచి పలు రకాల టాక్స్ ప్రతిపాదనలు వచ్చాయి. అయినా.. నియంత్రణ వ్యవస్థ రూపకల్పనలో ఆర్థికశాఖ ఇప్పటికీ ఏకాభిప్రాయానికి రాలేదు.