LIC IPO | కేంద్ర ప్రభుత్వ రంగ బీమా సంస్థ.. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)లో వాటాల ఉపసంహరణ ప్రక్రియ చురుగ్గా సాగుతున్నది. ఐపీవో ద్వారా నిధుల సేకరణతో ఎల్ఐసీలో వాటాలు ఉపసంహరించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. అందుకోసం ఎల్ఐసీ చట్టానికి సవరణలు తీసుకొచ్చే ప్రక్రియ కేంద్ర ప్రభుత్వ వర్గాలు చేపట్టాయి. ప్రస్తుతం ఎల్ఐసీ చట్టం ప్రకారం దేశీయ ఇన్వెస్టర్లు మాత్రమే ఆ సంస్థలో వాటాల కొనుగోలుకు నిబంధనలు పర్మిట్ చేస్తున్నాయి. బీమా రంగంలో 74 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)కు అనుమతులు ఉన్నా.. ఎల్ఐసీకి ఈ నిబంధన వర్తించదు. ఒకవేళ విదేశీ ఇన్వెస్టర్లను అనుమతించాలంటే.. ఎల్ఐసీ చట్టానికి సవరణలు తేవాల్సిందే. ఎల్ఐసీ చట్టాన్ని సరళతరం చేస్తే విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టొచ్చు. ఎల్ఐసీలో ఎఫ్‌డీఐని అనుమతించే విషయమై కేంద్ర ఆర్థిక శాఖ అభిప్రాయాలను తీసుకున్న వాణిజ్య, పరిశ్రమలశాఖ ఎఫ్‌డీఐ విధానంలో మార్పులపై కసరత్తు చేస్తున్నదని కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ధృవీకరించారు.
ఎల్ఐసీలో వాటాల ఉపసంహరణకు ప్రస్తుత ఎఫ్‌డీఐ విధానం అనుమతించదని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) కార్యదర్శి అనురాగ్ జైన్ తెలిపారు. అందువల్లే ఎల్ఐసీ చట్టానికి సవరణలు తేవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అత్యవసరంగా ఎల్ఐసీలో వాటాల ఉపసంహరణ చేపట్టాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఎఫ్‌డీఐ పాలసీని మరింత సరళతరం చేయడం చాలా ముఖ్యమైన అంశం. ఎల్ఐసీలో వాటాల ఉపసంహరణ ప్రక్రియ చేపట్టేందుకు ఎఫ్‌డీఐ పాలసీని సవరిస్తాం అని అనురాగ్ జైన్ వివరించారు.
ఎఫ్‌డీఐ పాలసీ సరళతరంపై ఫైనాన్సియల్ సర్వీసెస్, ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) విభాగాలు చర్చించాయి. డీపీఐఐటీ, ఆర్థికశాఖ, దీపం అధికారులతో రెండు దఫాలు చర్చించాం. ఎఫ్‌డీఐ పాలసీలో మార్పులపై ముసాయిదా రూపకల్పనలో నిమగ్నం అయ్యాం. త్వరలో ఆ ముసాయిదాను కేంద్ర క్యాబినెట్ ముందుకు తీసుకెళ్తాం అని అనురాగ్ జైన్ వెల్లడించారు.
ప్రస్తుత ఎఫ్‌డీఐ పాలసీ ప్రకారం దేశీయ బీమా రంగంలో నేరుగా 74 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతిస్తారు. ప్రత్యేక చట్టం కింద ఎల్ఐసీ ఉన్నందున ఈ నిబంధనలు దానికి వర్తించవు. ఐపీవోలో విదేశీ పోర్ట్‌పోలియో పెట్టుబడులు (ఎఫ్‌పీఐ), ఎఫ్‌డీఐలను అనుమతించే విషయమై సెబీ ఇప్పటికే నిబంధనలు ఖరారు చేసింది.
అయితే, ఎల్ఐసీలో ఎంత మేరకు ప్రభుత్వ వాటాలను ఉపసంహరించాలన్న విషయమై దీపం, ఆర్థికశాఖ సిఫారసులు చేస్తాయని అనురాగ్ జైన్ తెలిపారు. ఐపీవోలోకి ఎల్ఐసీ ఎంటరయ్యేందుకు అనుమతినిస్తూ కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) గత జూలైలో నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ వాటా విక్రయానికి ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో దేశ చరిత్రలోనే అతి పెద్దది కానున్న ఎల్ఐసీ ఐపీవో ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వశాఖలు చురుగ్గా చర్యలు చేపట్టాయి. జయప్రదంగా ఎల్ఐసీ ఐపీవో ముగియడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి.