గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Feb 15, 2021 , 19:49:04

బ్యాంకుల ప్రైవేటీక‌ర‌ణ లిస్ట్ రెడీ: త్రిశంకు స్వ‌ర్గంలో 1.20 ల‌క్ష‌ల కొలువులు

బ్యాంకుల ప్రైవేటీక‌ర‌ణ లిస్ట్ రెడీ: త్రిశంకు స్వ‌ర్గంలో 1.20 ల‌క్ష‌ల కొలువులు

న్యూఢిల్లీ: బ‌్యాంకుల ప్రైవేటీక‌ర‌ణ దిశ‌గా కేంద్రం ఒక అడుగు ముందుకేసింది. రెండు ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌ను 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రంలో ప్రైవేటీక‌రిస్తామ‌ని విత్త మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఈ నెల ఒక‌టో తేదీన పార్ల‌మెంట్‌కు స‌మ‌ర్పించిన బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల్లో పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో వాటాల విక్ర‌యం ద్వారా ఆదాయం పెంచుకునేందుకు కేంద్రం ప్ర‌య‌త్నాలు సాగిస్తోంది. 

నాలుగు బ్యాంకులతో షార్ట్ లిస్ట్‌

ప్రైవేటీక‌ర‌ణ దిశ‌గా నాలుగు ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల జాబితాను ఖ‌రారు చేసిన‌ట్లు స‌మాచారం. ఆ జాబితాలో బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్ర‌, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియ‌న్ ఓవ‌ర్సీస్ బ్యాంక్‌, సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయ‌ని తెలియ‌వ‌చ్చింది. బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు వంటి బ్యాంకుల‌నూ ప్రైవేటీక‌రించాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ త‌ల‌పోస్తున్న‌ట్లు వినికిడి.


వేల మంది ఉద్యోగుల‌కు ఉపాధి క‌ల్పిస్తున్న ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీక‌ర‌ణ‌తో వారి కొలువులు త్రిశంకు స్వ‌ర్గంలో ప‌డ‌టంతో పాటు కుటుంబాల జీవ‌నంపై తీవ్ర ప్ర‌తికూల ప్ర‌భావం చూప‌నున్న‌దని తెలుస్తున్న‌ది. దీనివ‌ల్ల రాజ‌కీయంగా కేంద్ర ప్ర‌భుత్వానికి ప్ర‌తికూల ప‌రిస్థితులు ఎదురయ్యే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. 

ద్వితీయ శ్రేణి బ్యాంకుల‌తో మొద‌లు పెట్టి..

విమ‌ర్శ‌లు, ఆందోళ‌న‌ను త‌ప్పించుకునేందుకు ద్వితీయ శ్రేణి బ్యాంకుల‌తో.. బ్యాంకుల ప్రైవేటీక‌ర‌ణ‌ను ప్రారంభించాల‌ని న‌రేంద్ర‌మోదీ స‌ర్కార్ త‌ల‌పోస్తున్న‌ది. ఇంత‌కుముందు ప్రైవేటీక‌ర‌ణ‌కు కేంద్రం షార్ట్ లిస్ట్‌ను బ‌య‌ట‌పెట్టలేదు. కానీ పైన పేర్కొన్న నాలుగు బ్యాంకుల్లో రెండింటిని ప్రైవేట్‌, కార్పొరేట్ సంస్థ‌ల‌కు ధారాద‌త్తం చేయ‌డానికి ఎంపిక చేయ‌నున్నార‌ని, ఏప్రిల్ నుంచి ఈ ప్ర‌క్రియ ప్రారంభం అవుతుంద‌ని ఆ వ‌ర్గాల క‌థ‌నం. 

స్ట్రాట‌ర్జిక్ బ్యాంక్‌గా ఎస్బీఐ..

తొలి ద‌శ‌లో మ‌ధ్య‌శ్రేణి, చిన్న బ్యాంకుల ప్రైవేటీక‌ర‌ణ పూర్తి చేసి, త‌దుప‌రి ద‌శ‌లో అతిపెద్ద బ్యాంకుల‌నూ కేంద్రం.. ప్రైవే‌ట్ శ‌క్తుల ప‌రం చేయ‌నున్న‌ట్లు అధికార వ‌ర్గాలు తెలిపాయి. గ్రామీణ ప్రాంతంలో రుణ ప‌ర‌ప‌తి సేవ‌ల‌ను విస్త‌రించ‌డానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)ను స్ట్రాట‌ర్జిక్ బ్యాంకుగా కేంద్రం కొన‌సాగించ‌నున్న‌ద‌ని స‌మాచారం. అందుకోసం ఎస్బీఐలో మెజారిటీ వాటాను కేంద్రం కొన‌సాగించ‌నున్న‌ట్లు తెలుస్తున్న‌ది.


క‌‌నుక ఇప్ప‌టికిప్పుడు ఎస్బీఐ వంటి పెద్ద బ్యాంకుల‌కు వ‌చ్చిన ముప్పేమీ లేదు. దీనిపై స్పందించేందుకు ఆర్థిక‌శాఖ అధికార ప్ర‌తినిధి నిరాక‌రించారు. మొండి బ‌కాయిలు ఎక్కువ‌గా ఉన్న బ్యాంకుల‌కు ప్రైవేటీక‌ర‌ణ ముప్పు పొంచి ఉంది. అయితే, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని అధికారులు హెచ్చ‌రించారు. 

ఏ బ్యాంకులో ఎంత మంది ఉద్యోగులు

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సుమారు 50 వేలు, సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 33 వేలు, ఇండియ‌న్ ఓవ‌ర్సీస్ బ్యాంకులో 26 వేలు, బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్ర‌‌లో 13 వేల మంది ఉద్యోగులు ప‌ని చేస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్ర‌లో ఉద్యోగుల సంఖ్య త‌క్కువ‌గా ఉన్నందున ప్రైవేటీక‌ర‌ణ తేలిక‌వుతుంద‌ని అధికార వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.


మరోవైపు బ్యాంకుల ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా సోమ‌, మంగ‌ళ‌వారాల్లో వివిధ బ్యాంకుల ఉద్యోగులు స‌మ్మె చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే, బ్యాంకుల ప్రైవేటీక‌ర‌ణ ప్ర‌క్రియ ప్రారంభించ‌డానికి ఐదారు నెల‌ల టైం ప‌డుతుంద‌ని కేంద్ర వ‌ర్గాలు చెప్పాయి.


బ్యాంకుల్లో ఉద్యోగుల సంఖ్య‌, కార్మిక సంఘాల ఒత్తిళ్లు, రాజ‌కీయ ప‌ర్య‌వ‌స‌నాలు.. బ్యాంకుల ప్రైవేటీక‌ర‌ణ‌పై తుది నిర్ణ‌యానికి వ‌స్తామ‌ని.. ఒత్తిళ్లు పెరిగితే ప్రైవేటీక‌రించే బ్యాంకుల పేర్లు మార‌తాయ‌ని అధికార వ‌ర్గాలు తెలిపాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo