Vehicle Scrapage Discount | అధిక కాలుష్యం వెలువరించే వాహనాలను వదిలించుకునేందుకు కేంద్ర రవాణాశాఖ ఆకర్షణీయ రాయితీలు ప్రతిపాదిస్తోంది. బీఎస్-2 సహా పాత కాలుష్య నియంత్రణ ప్రమాణాలతో తయారైన వాహనాలను స్క్రాప్‌కు పంపి కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారికి వన్ టైం టాక్స్ మీద డబుల్ రిబేట్ కల్పిస్తామని ప్రతిపాదించింది. గరిష్టంగా 50 శాతం రాయితీ కల్పిస్తానమి తెలిపింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం పాత వాహనాలను స్క్రాపేజ్ కింద తొలగించి కొత్త వాహనాలు కొనుగోలు చేస్తే మోటార్ వెహికల్ టాక్స్ మీద 25 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అదీ కూడా వాణిజ్య వాహనాలకు 15 శాతం రాయితీ మాత్రమే కల్పిస్తోంది. పాత వాహనాలను స్క్రాప్ కింద తొలగించే వారికి 50 శాతం వరకూ మోటార్ వెహికల్ టాక్స్‌లో రాయితీ కల్పించాలని ప్రతిపాదిస్తూ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. బీఎస్-1 ప్రమాణాలతో తయారైన వాహనాలకు కూడా ఈ రాయితీ వర్తిస్తుంది. కమర్షియల్, వ్యక్తిగత వాహనాలకూ ఇదే రాయితీ అమలు చేస్తామని కేంద్ర రవాణాశాఖ తెలిపింది. 2000లో బీఎస్-1, 2002 నుంచి బీఎస్-2 ప్రమాణాలు అమల్లోకి వచ్చాయి. స్వచ్ఛంద వాహన ఆధునీకరణ కార్యక్రమం లేదా వెహికల్ స్క్రాపింగ్ పాలసీని కేంద్ర రవాణాశాఖ ప్రారంభించింది. దీని కింద దేశవ్యాప్తంగా రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీస్ (ఆర్వీఎస్ఎఫ్), ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్ (ఏటీఎస్) ఏర్పాటు చేస్తోంది. 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆర్వీఎస్ఎఫ్, 12రాష్ట్రాల్లో ఏటీఎస్ వసతులు అందుబాటులో ఉన్నాయి.