Gas Rate Double | మున్ముందు పంటల సాగుకు విద్యుత్ వాడాలన్నా.. రసాయన ఎరువులు (fertiliser) కొనుగోలు చేయాలన్నా సగటు పౌరుడు.. సామాన్య రైతుకు షాక్ కొట్టడం ఖాయంగా కనిపిస్తున్నది. దీనికి కారణం విద్యుత్, రసాయన ఎరువుల తయారీకి ఉపయోగించే న్యాచురల్ గ్యాస్ ధర రెండు రెట్లకు పైగా కేంద్రం పెంచడమే. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా వంట గ్యాస్ ధర కూడా పెరుగనున్నది.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ వెలికితీసే న్యాచురల్ గ్యాస్ మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (ఎంఎంబీటీయూ) ధర 2.90 డాలర్ల నుంచి 6.10 డాలర్లకు పెరుగ నుంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి గ్యాస్ ధరల పెంపు అమల్లోకి రానున్నది. గత పది రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు (లీటర్‌పై రూ.6.40) తొమ్మిది రెట్లు పెరిగాయి. వంట గ్యాస్ సిలిండర్ ధర కూడా 50 పెరుగనున్నదని తెలుస్తున్నది.
ప్రతి ఆరు నెలలకోసారి గ్యాస్ ధరలను పెంపునకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ఏప్రిల్ ఒకటో తేదీన, అక్టోబర్ ఒకటో తేదీన గ్యాస్ ధరలు పెరుగుతాయి. అమెరికా, కెనడా, రష్యాల్లో ధరలకు అనుగుణంగా గ్యాస్ ధరలు ఖరారవుతాయి. దీని ప్రకారం ఢిల్లీ, ముంబై నగరాల్లో సీఎన్జీ గ్యాస్ ధరలు 10-15 శాతం, వంట గ్యాస్ ధరలు కూడా పెరుగుతాయని పారిశ్రామిక వర్గాలు చెప్పాయి.
ఇప్పటి వరకు సీఎన్జీతోపాటు వంట గ్యాస్‌ను ఓఎన్జీసీ ఉత్పత్తి చేసిన గ్యాస్‌ను దేశంలోని వివిధ నగరాలకు సరఫరా చేస్తున్నారు. సీఎన్జీ గ్యాస్ ధర పెంచడంతో విద్యుత్, రసాయన ఎరువుల ఉత్పత్తి ఖర్చు కూడా పైపైకి దూసుకెళ్లనున్నది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో విద్యుత్ చార్జీల ధరలు పెరిగాయి. మున్ముందు వివిధ పంటల్లో రైతులు వాడే రసాయన ఎరువులు ( fertiliser ) కూడా పెరగడం ఖాయంగా కనిపిస్తున్నది.