న్యూఢిల్లీ, జూలై 9: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌కు ప్రపంచ శ్రీమంతుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గుడ్‌బై చెప్పారు. 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు కుదుర్చుకున్న డీల్‌ను రద్దు చేసుకుంటున్నట్టు మస్క్ ప్రకటించారు. వెనువెంటనే మస్క్‌పై ట్విట్టర్ విరుచుకుపడింది. డీల్‌ను పూర్తిచేసేందుకు టెస్లా సీఈవోపై కోర్టులో దావా వేస్తామన్నది. వాస్తవానికి డీల్‌ను బ్రేక్అప్ చేసుకున్నందుకు మస్క్ నుంచి 1 బిలియన్ డాలర్లను ఫీజును ట్విట్టర్ వసూలు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, కొనుగోలు ఒప్పందాన్ని పూర్తి చేయించడానికి ట్విట్టర్ సిద్ధమైనట్టు కన్పిస్తోంది. నకిలీ ఖాతాల సంఖ్య తగిన సమాచారం ట్విట్టర్ ఇవ్వడం లేదనే ఆరోపణతో మస్క్ ఈ డీల్ రద్దు చేసుకున్నారు. కాగా, నకిలీ/స్పామ్ ఖాతాల సంఖ్యను బేరిజు వేసుకునేందుకు సమాచారాన్ని కోరుతూ తన క్లయింట్ రెండు నెలలు వేచిచూసినా, ఈ సమాచారం ఇవ్వలేదంటూ మస్క్ లాయర్ మైక్ రింగ్లర్.. ట్విట్టర్ బోర్డ్‌కు లేఖ రాశారు.