ముంబై, మే 18: ప్రత్యేక ట్రేడింగ్‌లోనూ దేశీయ స్టాక్ మార్కెట్ల ర్యాలీ కొనసాగింది. వరుసగా మూడోరోజు సూచీలు లాభాల్లో ముగిశాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులు కుమ్మరించడంతో ఒక దశలో 245 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ తిరిగి 74 వేల మార్క్‌ను అధిగమించింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 88.91 పాయింట్లు అందుకొని 74,005.94 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 35.90 పాయింట్లు ఎగబాకి 22,502 వద్ద స్థిరపడింది. దేశీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీలైన ఎన్ఎస్ఈ, బీఎస్ఈలకు చెందిన ప్రాథమిక సైట్లలో అంతరాలు లేదా వైఫల్యాలను ఎదుర్కునేందుకు ఈ శనివారం ప్రత్యేక ట్రేడింగ్ నిర్వహించారు. ఉదయం 9.15 గంటలకు ప్రారంభమైన ట్రేడింగ్ మళ్లీ 10 గంటలకు నిలిపివేయగా..తిరిగి 11.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నాం 12.30 గంటలకు నిలిపివేశారు. సుమారు 1.45 గంటల పాటు సాగిన ప్రత్యేక ట్రేడింగ్‌లో సూచీలు కదంతొక్కాయి. దీంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల విలువ రికార్డు స్థాయి రూ.4,12,36,791.05 కోట్లకు చేరుకున్నది.