హైదరాబాద్, డిసెంబర్ 14: హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న విలువైన లోహాలు, రత్నాల సంస్థ గోల్డ్‌సిక్కా.. వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా 3వేలకుపైగా ఉద్యోగులను తీసుకోనున్నది. దేశంలోని అన్ని జిల్లాల్లో 2వేలకుపైగా ఉద్యోగులను ఫీట్ ఆన్ స్ట్రీట్ (ఎఫ్‌వోఎస్) బృందాలుగా, డిజైనర్లు, వర్క్‌మెన్, గోల్డ్ అసోసియేట్లు, గోల్డ్ అస్సేయర్లుగా నియమించుకోనున్నట్లు మంగళవారం సంస్థ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ వీరు పనిచేస్తారన్నది. ఇక సంస్థ టెక్నాలజీ ల్యాబ్‌ల్లో పనిచేసేందుకు 200 మంది సాంకేతిక నిపుణులను, డిజిటల్/ఆన్లైన్ మార్కెటింగ్ కోసం మరో 200 మంది ప్రతిభావంతులను నియమించుకోనున్న సంస్థ.. అన్ని జిల్లా కేంద్రాల్లోగల వివిధ శాఖల్లో పనిచేసేందుకు 200 మందిని తీసుకోనున్నది. అలాగే దేశవ్యాప్తంగా గోల్డ్ కలెక్షన్ కార్యకలాపాల కోసం 500 మందిని ఉద్యోగాల్లోకి తీసుకోనున్నది. ఈ నియామకాల కోసం ప్రముఖ హెచ్ఆర్ రిక్రూటింగ్ సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుంటున్నట్లు ఈ సందర్భంగా సంస్థ చెప్పింది.