Goldman Sachs | ఇంటర్నేషనల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ గోల్డ్‌మాన్ సాచెస్ కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) స్థాయి ఉద్యోగాల్లో కోత విధించాలని నిర్ణయించింది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సెక్టార్‌తోపాటు మొత్తం 125 మంది ఎండీలను తొలగించాలని నిర్ణయించినట్లు సమాచారం. మరో ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్.. జేపీ మోర్గాన్ సైతం భారీగా ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తున్నది.
ఆర్థిక మాంద్యం వార్తల నేపథ్యంలో ఏడాది కాలంగా గోల్డ్‌మాన్ సాచెస్ పొదుపు చర్యలు పాటిస్తున్నది. ఇప్పటికే మూడు దఫాలుగా ఉద్యోగులను తొలగించి వేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎండీ స్థాయి అధికారుల తొలగింపుపై గోల్డ్‌మాన్ సాచెస్ అధికారికంగా స్పందించలేదు. మరో 125 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్ లను తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఐదు నెలల క్రితం దాదాపు 4,000 మంది ఉద్యోగులను ఇండ్లకు సాగనంపింది.
అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ సంక్షోభంలో చిక్కుకున్నాయి. మరోవైపు స్వీడన్ కు చెందిన క్రెడిట్ సూయిజ్ బ్యాంకింగ్ సంస్థను యూబీఎస్ టేకోవర్ చేసిన సంగతి తెలిసిందే. సిలికాన్ వ్యాలీ బ్యాంకును ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.