Goldman Sachs on Bitcoin | క్రిప్టో మేజర్ బిట్ కాయిన్ 2022లో మార్కెట్లో బంగారం షేర్ విలువను కైవశం చేసుకుంటుందని ప్రముఖ ఇంటర్నేషనల్ పేమెంట్స్ సంస్థ గోల్డ్‌మాన్ సాచెస్ అనలిస్ట్ జాచ్ పండిల్ వ్యాఖ్యానించాడు. ఇన్వెస్ట్మెంట్ పరంగా బంగారం విలువ 2.6 లక్షల కోట్ల డాలర్లు.. బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ 700 బిలియన్ల డాలర్లు. ప్రస్తుతం స్టోర్ ఆఫ్ వాల్యూ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ 20 శాతం వాటా కలిగి ఉంది. మున్ముందు భారీ మొత్తంలో స్టోర్ ఆఫ్ వాల్యూ వాటాను పెంచుకుంటుందని గోల్డ్‌మాన్ సాచెస్ 2022 అంచనాల్లో తెలిపింది.
బిట్ కాయిన్ విలువ లక్ష డాలర్లను దాటినప్పుడు మాత్రమే.. బంగారంతో పోలిస్తే 50 శాతం స్టోర్ ఆఫ్ వాల్యూ మార్కెట్ వాటాను పొందగలుగుతుందని తెలిపింది. గతేడాది నవంబర్ 20న ఆల్‌టైమ్ రికార్డ్ 68,790 డాలర్లు పలికిన బిట్ కాయిన్.. బుధవారం 46,073కి పడిపోయింది. పతనం కాకుండా డిజిటల్ కరెన్సీ విలువ నిలకడగా కొనసాగితే స్టోర్ ఆఫ్ వాల్యూ మార్కెట్ వాటాలో బంగారంపై బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలు పై చేయి సాధిస్తాయన్నది. గతేడాది గోల్డ్‌మాన్ సాచెస్ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ డెస్క్‌ను పునః ప్రారంభించింది.