న్యూఢిల్లీ : టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉద్యోగాలను రీప్లేస్ చేస్తుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. పలు ఉద్యోగాలపై చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్ ప్రభావం చూపుతాయనే చర్చ జోరుగా సాగుతోంది.
కస్టమర్ సర్వీస్ ఉద్యోగాలు తొలిగా దెబ్బతింటాయని చాట్‌జీపీటీ క్రియేటర్ ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మాన్ బాంబు పేల్చగా తాజాగా గోల్డ్‌మన్ శాక్స్ (Goldman Sachs) నివేదిక సైతం ఏఐ రాకతో పలు ఉద్యోగాలు కనుమరుగవుతాయని పేర్కొంది. అడ్మినిస్ట్రేషన్, న్యాయ సేవల రంగాలపై పెను ప్రభావం ఉంటుందని అంచనా వేసింది. ఏఐ ఆటోమేషన్ అధికంగా ఉన్న అమెరికా, యూరప్‌లో మూడింట ఓ వంతు ఉద్యోగాలను భర్తీ చేయగల సామర్ధ్యం ఏఐకి ఉందని గోల్డ్‌మన్ శాక్స్ రిపోర్ట్ స్పష్టం చేసింది.
ఏఐతో 44 శాతం లీగల్ జాబ్స్, 46 శాతం అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్ కోల్పోతామని గోల్డ్‌మన్ శాక్స్ చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. నిర్మాణ, మెయింటెనెన్స్ రంగాల్లో ఉద్యోగాలు వరుసగా 6 శాతం, 4 శాతం మేర దెబ్బతింటాయని ఆ రిపోర్ట్ పేర్కొంది. జనరేటివ్ ఏఐతో కార్మికుల డిమాండ్ తగ్గుతుందని, కార్మిక ఉత్పాదక వృద్ధిపై సానుకూల ప్రభావం ఉంటుందని తెలిపింది. మరోవైపు ఏఐ రాకతో కార్మిక వ్యయాలు తగ్గి నూతన ఉపాధి అవకాశాలు పెరిగి ఉత్పాదకత పెరుగుతుందని ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా వృద్ధి ఊపందుకుంటుందని గోల్డ్‌మన్ శాక్స్ నివేదిక అంచనా వేసింది.
Read More :