హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, సెక్యూరిటీస్ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్.. హైదరాబాద్‌లో మరో అత్యాధునిక కార్యాలయాన్ని తెరిచింది. ఈ కొత్త సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీవోఈ)ను గురువారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మరిన్ని గ్లోబల్ కంపెనీల వృద్ధికి గోల్డ్‌మన్ శాక్స్ విస్తరణ.. దోహదం చేయగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల విధానాలతో గడిచిన తొమ్మిదిన్నర ఏండ్లలో ప్రపంచ శ్రేణి కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యకలాపాలను ఎంతో విస్తృతం చేశాయన్న మంత్రి.. స్థానిక యువ ప్రతిభావంతులకు ప్రపంచ స్థాయిలో అవకాశాలూ లభించాయని చెప్పారు. గ్లోబల్ కంపెనీల పెట్టుబడులు, భాగస్వామ్యాలకు గోల్డ్‌మన్ శాక్స్ నూతన కార్యాలయం ఓ చక్కని వేదికగా ఉంటుందన్నారు.
2021లోనే గోల్డ్‌మన్ శాక్స్ హైదరాబాద్‌లో కార్యకలాపాలను ప్రారంభించింది. ఇప్పుడు ఈ కొత్త ఆఫీస్‌తో విస్తరణ బాట పట్టడం సంతోషంగా ఉందని కేటీఆర్ అన్నారు. బహుళజాతి సంస్థల కార్యాలయాల ఏర్పాటుకు, వాటి వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాల విస్తరణకు రాష్ట్ర పర్యావరణ వ్యవస్థ సరిగ్గా కుదురుతున్నదన్నారు. అందుకే ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్‌తోపాటు ఆర్థిక సేవలు, బ్యాంకింగ్ రంగంలో సైతం తెలంగాణ రాష్ట్రం శరవేగంగా ముందుకు సాగుతున్నదని తెలిపారు. ఇందుకు గోల్డ్‌మన్ శాక్స్ నిదర్శనమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే డిజిటల్ అక్షరాస్యత, మహిళా సాధికారతల ద్వారా సమాజాభివృద్ధిపట్ల గోల్డ్‌మన్ శాక్స్ కున్న నిబద్ధతను అభినందించారు.
గోల్డ్‌మన్ శాక్స్ ఇంటర్నేషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) రిచర్డ్ గ్నోడ్ మాట్లాడుతూ.. ఇక్కడి అసాధారణ యువ ప్రతిభా వంతులతో తమ సంస్థ శరవేగంగా ముందుకు సాగుతున్నదని చెప్పారు. బెంగళూరు, హైదరాబాద్ కేంద్రంగా తాము భారత్ నుంచి ప్రపంచస్థాయి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. కాగా, కొత్తగా ఏర్పాటుచేసిన హైదరాబాద్ కార్యాలయంతో ఇక్కడి గోల్డ్‌మన్ శాక్స్ ఉద్యోగులు మరో 1000 మంది పెరగనున్నారని తెలుస్తున్నది.