Gold Rate | పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా పెరుగుతున్నాయి. తాజాగా ఒకేరోజు రూ.5వేలకపైగా పెరిగి తొలిసారిగా జీవితకాల గరిష్ఠానికి చేరాయి. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.5,080 పెరిగి తులానికి రూ.1,12,750కి పెరిగింది. డాలర్ బలహీనపడడంతో బంగారానికి డిమాండ్ పెరిగిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది. మరో వైపు వెండి ధరలు సైతం భారీగానే పెరిగాయి. రూ.2,800 పెరిగి కిలోకు రూ.1,28,800 పెరిగి రికార్డు స్థాయికి చేరుకుంది. ప్రపంచ మార్కెట్లలో పసిడి మంగళవారం ఔన్సుకు 3,659.27 డాలర్లకు చేరి జీవితకాల గరిష్ఠానికి చేరింది.
ఆ తర్వాత స్వల్పంగా తగ్గి 3,652.72 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. యూఎస్ డాలర్ బలహీనపడడం.. త్వరలో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించనుందన్న అంచనాల మధ్య బంగారం వంటి సురక్షితమైన ఆస్తులపై పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతుందని వ్యాపారులు పేర్కొన్నారు. ఎంసీఎక్స్‌లో ప్రారంభంలో బంగారం, వెండి మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో అక్టోబర్ ఫ్యూచర్ గోల్డ్ తులానికి రూ.429 లాభంతో రూ.1,08,947 వద్ద మొదలైంది. ఇదే క్రమంలో రూ.1,09,500 గరిష్ఠాన్ని తాకింది. కామెక్స్‌లో బంగారం 0.50శాతం లాభంతో 3654 డాలర్ల వద్ద.. ఎంసీఎక్స్‌లో 0.69శాతం లాభాలతో రూ.1,09,250 వద్ద ట్రేడ్ అయింది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో బంగారం ధరలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల బంగారం రూ.1,10,290 ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,01,100 వద్ద ట్రేడవుతున్నది. ఇక వెండి ధర కిలోకు 1.40లక్షలకు పెరిగింది.