Gold Rate | బంగారం ధర రికార్డుల మోత మోగిస్తున్నది. భారీ కొనుగోళ్ల మధ్య దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర బుధవారం ఒకే రోజు రూ.1000 పెరిగింది. తులం బంగారం ధర రూ.82వేల మార్క్‌ను అధిగమించింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం.. 99.9 శాతం ప్యూరిటీ గోల్డ్ ధర రూ.1000 పెరిగి తులానికి గరిష్ఠ స్థాయి రూ.82,400 చేరుకుందని తెలిపింది. 99.5శాతం ప్యూరిటీ గోల్డ్ రూ.1000 పెరిగి రూ.82వేలకు ఆల్‌టైమ్ హైకి చేరుకుంది. దీపావళి పండుగ నేపథ్యంలో వర్తకుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ ఈ ధరల పెరుగుదలకు కారణమని బులియన్ మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్స్ తులం బంగారం రూ.81,160 ఉండగా.. 22 క్యారెట్స్ పసిడి రూ.74,400 ధర పలికింది.
గురువారం హైదరాబాద్‌లో 24 క్యారెట్స్ గోల్డ్ ధర తులానికి రూ.81,330 ఉండగా.. 22 క్యారెట్స్ పసిడి రూ.74,550 వద్ద కొనసాగుతున్నది. అయితే, అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు అనిశ్చిత భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా దీపావళి సందర్భంగా పెరుగుతున్న డిమాండ్‌తో పాటు స్థానిక ఆభరణాల వ్యాపారులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేయడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు. గతేడాది అక్టోబర్ 29 నుంచి బంగారం ధర 35శాతం పెరిగింది. గతేడాది అక్టోబర్ మొదట్లో తులం బంగారం రూ.61,200 పలికింది. ఇక వెండి ధర సైతం విపరీతంగా పెరుగుతున్నది. కిలోకు రూ.లక్షకుపైగానే పలుకుతున్నది. గతేడాది అక్టోబర్ 29 నాటికి కిలో వెండి రూ.74వేల ఉండగా.. ప్రస్తుతం 36శాతం పెరిగింది.