Gold -Silver Rates | అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత అంతర్జాతీయంగా, జాతీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.50 తగ్గి రూ.77,750లతో నాలుగు వారాల కనిష్ట స్థాయికి పడిపోయింది. మంగళవారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.77,800 వద్ద స్థిర పడింది. మరోవైపు, బుధవారం కిలో వెండి ధర రూ.1,200 పెరిగి రూ.92,500లకు చేరుకున్నది. మంగళవారం కిలో వెండి ధర రూ.91,300 పలికింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో డిసెంబర్ డెలివరీ గోల్డ్ కాంట్రాక్ట్స్ ధర రూ.204 పెరిగి రూ.75,105 వద్ద స్థిర పడింది. కిలో వెండి డిసెంబర్ డెలివరీ ధర రూ.760 పుంజుకుని రూ.90,087 వద్ద ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ బంగారం ధర 8 డాలర్లు పెరిగి 2614.30 డాలర్లు పలికింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలతోపాటు యూఎస్ డాలర్, ట్రెజరీ బాండ్ల విలువ పెరగడంతో బంగారం ధర దిగి వస్తోంది. ఆరు నెలలుగా గోల్డ్ ఈటీఎఫ్ ల్లోకి వస్తున్న పెట్టుబడులు నవంబర్ మొదటి వారంలో 809 మిలియన్ల డాలర్లను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారని ప్రపంచ స్వర్ణ మండలి తెలిపింది.