న్యూఢిల్లీ, డిసెంబర్ 9: బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో పుత్తడి ధర రూ.79 వేల దిగువకు పడిపోయింది. బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి రూ.190 తగ్గిన తులం ధర రూ.78,960కి దిగొచ్చింది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన గోల్డ్ ధర రూ.190 తగ్గి రూ.78,650గా నమోదైంది. కానీ వెండి ధరలు పెరిగాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి రూ.350 పెరిగి రూ.93,850 పలికింది.
కానీ, హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ తులం పుత్తడి ధర స్వల్పంగా రూ.160 పెరిగి రూ.77,780కి చేరుకున్నది. అలాగే 22 క్యారెట్ గోల్డ్ ధర రూ.150 అందుకొని రూ.71,300కి చేరింది. అంతర్జాతీయంగా రాజకీయ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు పెరిగినప్పటికీ రిటైల్‌గా మాత్రం తగ్గుముఖం పట్టాయని ఆల్ ఇండియా సరాఫ్ అసోసియేషన్ వర్గాలు వెల్లడించాయి. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 2,673 డాలర్లు పలుకగా, వెండి 32.19 డాలర్ల వద్ద ఉన్నది.