Dhanteras | ముంబై, అక్టోబర్ 29 : బంగారం, వెండి దుకాణాల్లో ఈసారి ధనత్రయోదశి సందడి పెద్దగా కనిపించలేదు. మంగళవారం ఉదయం ఆరంభం నుంచే నీరసంగా మొదలైన వ్యాపారం.. రాత్రిదాకా అంతంతమాత్రంగానే సాగింది. దీంతో అధిక ధరలు కొనుగోళ్లకు అడ్డంకిగా మారాయన్న అభిప్రాయాలు నగల వర్తకుల నుంచి వినిపించాయి. ఈ క్రమంలోనే గత ఏడాదితో పోల్చితే ఈసారి సేల్స్ 10 శాతం పడిపోవచ్చని అంటున్నారు. నిరుడు ధనత్రయోదశికి ఉన్న ధరతో ప్రస్తుత ధరను చూస్తే 33 శాతం ఎగిసినట్టు గుర్తుచేస్తున్నారు. నాడు (నవంబర్ 11, 2023) తులం 24 క్యారెట్ గోల్డ్ రూ.61,200 పలికింది. ఇప్పుడు రూ.81,400గా ఉన్నది. ఏడాది కాలంలో రూ.20,200 పెరుగుదల చోటుచేసుకున్నది. కాగా, ఏటా దీపావళికి రెండు రోజుల ముందు వచ్చే ఈ ధనత్రయోదశి రోజున బంగారం, వెండి, వజ్రాలు, ఇతరత్రా విలువైన లోహాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తే శుభం కలుగుతుందని అందరి (ముఖ్యంగా హిందువులు) నమ్మకం. అందుకే జ్యుయెల్లరీ మార్కెట్లో ఈ రోజుకు చాలా ప్రత్యేకత ఉంటూ వస్తున్నది.
ఈసారి ధనత్రయోదశి అమ్మకాలు గతంతో చూస్తే 10 శాతం తక్కువగా నమోదు కావచ్చని అఖిల భారత రత్నాలు, ఆభరణాల మండలి చైర్మన్ సైయం మెహ్రా అంటున్నారు. అయితే బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటా 11నిమిషాలదాకా ధనత్రయోదశి ముహూర్తం ఉన్నందున అమ్మకాలు పెరుగుతాయన్న విశ్వాసాన్నే మెహ్రా వ్యక్తం చేస్తున్నారు. అలాగే అధిక ధరల నేపథ్యంలో పరిమాణంపరంగా సేల్స్ తగ్గినా.. విలువపరంగా 20 శాతం ఎక్కువగా నమోదు కావచ్చన్నారు. 2, 3, 4, 5, 8 గ్రాముల బంగారు నాణేలతోపాటు గొలుసులు, చెవి కమ్మలు, బ్రేస్లెట్ల వంటి తేలికపాటి నగలకు గిరాకీ కనిపిస్తున్నట్టు చెప్పారు. మరోవైపు రికార్డుస్థాయి ధరలు వ్యాపారావకాశాలను దెబ్బతీశాయని, అందుకే మార్కెట్లోకి కస్టమర్లు పెద్దగా రాలేదని జ్యుయెల్లర్స్ చెప్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా తులం పుత్తడి ధర గత వారం రూ.81,500 తాకడం గమనార్హం. సోమవారం రూ.400 తగ్గినా.. సేల్స్‌ను అది పెంచలేకపోయింది. నిజానికి దేశంలోకి వచ్చే పసిడి దిగుమతులపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం తగ్గించిన సుంకాలు.. అమ్మకాలను పెంచుతాయన్న అభిప్రాయాలు వినిపించాయి. ఈ క్రమంలోనే 99.9 స్వచ్ఛత కలిగిన 24 క్యారెట్ గోల్డ్‌కు ఈసారి డిమాండ్ బాగానే ఉంటుందని ఎంఎంటీసీ-పీఏఎంపీ కూడా అంచనా వేసింది.
ధనత్రయోదశికి బంగారం, వెండి తదితర విలువైన లోహాల కొనుగోళ్లేగాక వాహనాలు, గృహాలు, ఇతరత్రా విలువైన గృహోపకరణాల అమ్మకాలూ జోరుగా సాగుతాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది ధనత్రయోదశి విక్రయాల విలువ దేశవ్యాప్తంగా రూ.60,000 కోట్లుగా ఉండొచ్చని అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) అంచనా వేస్తున్నది. ఇందులో బంగారం వాటానే రూ.20,000 కోట్లుగా ఉంటుందని, వెండి అమ్మకాలు రూ.2,500 కోట్లుగా ఉంటాయని సీఏఐటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ అంటున్నారు. వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్ టెలివిజన్లు, మొబైల్ ఫోన్లు, మిక్సర్-గ్రైండర్లు, మైక్రోవేవ్ అవెన్లు, ఏసీలు ఇలా అన్నింటికీ గిరాకీ ఉంటుందని చెప్తున్నారు.
బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. సోమవారం రికార్డు స్థాయిల నుంచి తగ్గిన గోల్డ్ రేట్లు.. మంగళవారం తిరిగి పుంజుకున్నాయి. దీంతో ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ పుత్తడి విలువ రూ.300 పెరిగి రూ.81,400 పలికింది. ఇది శనివారం నమోదైన ఆల్‌టైమ్ హై రూ.81,500కు సమీప స్థాయి కావడం గమనార్హం. మరోవైపు వెండి ధర కిలో రూ.200 ఎగిసి రూ.99,700 వద్ద ఆగింది. పారిశ్రామిక, నాణేల తయారీదారుల నుంచి వచ్చిన డిమాండ్ కలిసొచ్చిందంటూ వ్యాపార సరళిని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాగా, నిరుడు ధనత్రయోదశి రోజున కిలో వెండి రూ.74,000 పలికింది. దీంతో ఏడాదిలో రేట్లు 35 శాతం పెరిగినైట్టెంది. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ తులం ధర రూ.80,450గా, 22 క్యారెట్ రూ.73,750గా ఉన్నాయి. రూ.650, 600 చొప్పున పెరుగుదల కనిపించింది.