Gold Rates | వచ్చే ఏడాది మరో రెండు దఫాలు వడ్డీరేట్లు తగ్గిస్తామని యూఎస్ ఫెడ్ రిజర్వ్ ప్రకటించడంతో బులియన్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం పడింది. గురువారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్లు) ధర రూ.800 పతనమై రూ.78,300లకు చేరుకున్నది. బుధవారం రూ79,100 వద్ద స్థిర పడింది. 2025 చివరి కల్లా మరో రెండు దఫాలు వడ్డీరేట్లు తగ్గిస్తామని యూఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చెప్పడంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలహీన పడింది.
గురువారం కిలో వెండి ధర రూ.2,000 తగ్గి రూ.90 వేలకు చేరుకున్నది. బుధవారం కిలో వెండి ధర రూ.92,000 పలికింది. ఇక 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.800 తగ్గి రూ.77,900లకు చేరుకున్నది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో ఫిబ్రవరి డెలివరీ బంగారం తులం ధర రూ.303 పతనమై రూ.76,350లకు పడిపోయింది. కిలో వెండి మార్చి డెలివరీ ధర రూ.1,630 క్షీణించి రూ.88,750లకు చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ గోల్డ్‌లో ఔన్స్ బంగారం ధర 19.10 డాలర్లు నష్టపోయి 2,634.10 డాలర్లు పలికింది. ఔన్స్ వెండి ధర 2.47 శాతం పతనంతో 29.98 డాలర్లకు చేరుకున్నది.