Gold-Silver Price | బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు బిగ్ రిలీఫ్ ఇచ్చాయి. ఇటీవల భారీగా పెరుగుతూ వస్తున్న ధరలు కాస్త ఉపశమనం కల్పించాయి. స్టాకిస్టుల అమ్మకాల నేపథ్యంలో వెండి ధర భారీగా తగ్గగా.. పసిడి రేటు స్వల్పంగా దిగివచ్చింది. రాజధాని ఢిల్లీలో మంగళవారం 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.200 తగ్గి రూ.99,370కి పతనమైంది. ఇక 22 క్యారెట్ల బంగారం రూ.200 తగ్గి తులానికి రూ.98,800కి చేరుకుంది. వెండి రూ.3వేలు తగ్గి కిలోకు రూ.1.12లక్షలకు చేరిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. వెండి సోమవారం రూ.5వేలు పెరిగి రికార్డు స్థాయికి చేరిన విషయం తెలిసిందే. డాలర్ బలపడడంతో బంగారం, వెండి ధరలు దిగివచ్చాయి. మెహతా ఈక్విటీస్ కమోడిటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలాంత్రి మాట్లాడుతూ బంగారం, వెండి తీవ్ర అస్థిరతను ఎదుర్కొన్నాయని అన్నారు. ప్రారంభంలో పెరిగినా.. ఆ తర్వాత డాలర్ ఇండెక్స్ పెరగడంతో గరిష్టాల నుంచి తగ్గుముఖం పట్టాయన్నారు.
కీలకమైన యూఎస్ ద్రవ్యోల్బణం డేటా విడుదల కానున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగారన్నారు. ద్రవ్యోల్బణం డేటాతో బులియన్ ధరల దిశను నిర్ణయించగలదని కలాంత్రి పేర్కొన్నారు. మరో వైపు అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 20.62 పెరిగి ఔన్సుకు 3,364.14 డాలకు పెరిగింది. భౌగోళిక రాజకీయ, వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న బంగారం పరిమిత పరిధిలోనే ఉందని అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చింతన్ మెహతా అన్నారు. యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మెక్సికో, యూరోపియన్ యూనియన్ దిగుమతులపై 30శాతం సుంకాన్ని ప్రకటించిన తర్వాత బంగారం డిమాండ్ స్వల్పంగా పెరిగిందని.. అయితే చర్చల అంచనాల నేపథ్యంలో లాభాలను పరిమితం చేసిందని వివరించారు. ఇక హైదరాబాద్లో బంగారం ధరల విషయానికి వస్తే 24 క్యారెట్ల పసిడి రూ.99,770 పలుకుతున్నది. 22 క్యారెట్ల పుత్తడి రూ.91,450 వద్ద ట్రేడుతున్నది. ఇక వెండి కిలోకు రూ.1.25లక్షలు పలుకుతున్నది.