Gold Rate | పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. ఇటీవల వరుసగా మూడురోజుల పాటు తగ్గుతూ వచ్చిన ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధానిలో తులం బంగారం ధర రూ.88,790కి చేరింది. బంగారం ధరలను పెరిగిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది. 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.40 పెరిగి తులానికి రూ.88,790కి పెరిగింది. ఇక 22 క్యారెట్స్ స్వర్ణం ధర సైతం రూ.40 పెరిగి రూ.80,390కి చేరింది. ఇక వెండి ధర రూ.350కి తగ్గి.. కిలో రూ.98,900కి చేరుకుంది. గ్లోబల్ మార్కెట్లో ఏప్రిల్ డెలివరీకి సంబంధించిన కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్‌కు 19.30 డాలర్లు పెరిగి 2,918.70కి చేరుకుంది.
స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 0.82శాతం పెరిగి.. 2,912.43 డాలరకు చేరింది. ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్ అనలిస్ట్ వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది మాట్లాడుతూ.. డాలర్ ఇండెక్స్ బలహీనపడడంతో బంగారం ధరలు పెరిగాయన్నారు. యూఎస్‌లో సుంకాల ఆందోళనలు ఆర్థిక అనిశ్చితిని సూచిస్తున్నాయన్నారు. దాంతో సురక్షితమైన పెట్టుబడికావడంతో బంగారం కొనుగోళ్లు బలంగా ఉన్నాయన్నారు. ఈటీఎఫ్ ఇన్‌ఫ్లోలు బుల్లిష్ సెంటిమెంట్‌కు మద్దతునిచ్చాయి. ఆసియా మార్కెట్లో కామెక్స్ సిల్వర్ ఫ్యూచర్ ఔన్స్‌కు 1.44శాతం పెరిగాయి.
హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ కమోడిటీ విశ్లేషకుడు సౌమిల్ గాంధీ మాట్లాడుతూ.. బులియన్ మార్కెట్ పెట్టుబడిదారులు ట్రంప్ సుంకాలను నిశితంగా పరిశీలిస్తున్నారన్నారు. సమీప భవిష్యత్‌లో సుంకాల యుద్ధం ఎలాంటి రూపాన్ని తీసుకుంటుందో అంచనా వేసేందుకు పెట్టుబడిదారులు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇక దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్స్ గోల్డ్ రూ.80,200 ఉండగా.. 24 క్యారెట్స్ పసిడి రూ.87,490 పలుకుతున్నది. ముంబయిలో 22 క్యారెట్స్ పుత్తడి రూ.80,200 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.87,490కి చేరింది. తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు ఏపీలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధర కిలోకు రూ.1,07,000 పలుకుతున్నది.