Gold Rates | పుత్తడి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. వరుసగా రెండోరోజూ ధరలు స్వల్పంగా పతనమయ్యాయి. ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో బంగారం డిమాండ్ పడిపోయింది. దాంతో దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.500 తగ్గి తులం రూ.99,120కి చేరుకుంది. మరో వైపు 22 క్యారెట్ల పసిడి ధర సైతం రూ.500 తగ్గడంతో తులానికి రూ.98,750కి పడిపోయింది. మరో వైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతున్నది. కిలోకు రూ.1.15లక్షలు పలుకుతుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకుడు (కమోడిటీస్) సౌమిల్ గాంధీ మాట్లాడుతూ బంగారం ఈ పతనానికి కారణం సుంకాలకు సంబంధించిన ఆందోళనలు తగ్గడమేనన్నారు. అలాగే, బలమైన ఉపాధి మార్కెట్, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించనున్న అంచనాల మధ్య ధరలు తగ్గాయని పేర్కొన్నారు. జపాన్‌తో యూఎస్ వాణిజ్య ఒప్పందం చివరకు చేరుకుంది. యూఎస్-ఈయూ వాణిజ్య ఒప్పందం జరుగనుందనే అంచనాలున్నాయి. భారతదేశం, మెక్సికో, బ్రెజిల్ దేశాలతో అమెరికా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకునే అవకాశాలున్నాయి. దాంతో బులియన్ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి మరింత పెంచే అవకాశాలున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ బంగారం ఔన్సుకు 20.72 శాతం తగ్గి 3,347.94 డాలర్లకు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా స్పాట్ వెండి ఔన్సుకు 0.35 శాతం తగ్గి 38.92 డాలర్లకు పడిపోయింది. సుంకాల ఒప్పందం అంచనాలు బంగారంపై ఆకర్షణను తగ్గించాయని ఎల్కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ రీసెర్చ్ అనలిస్ట్ (కమోడిటీ అండ్ కరెన్సీ) జతిన్ త్రివేది పేర్కొన్నారు. బంగారం ఔన్సుకు 3,345 డాలర్ల వద్ద బలహీనంగా ట్రేడవుతోందని తెలిపారు. యూఎస్, జపాన్, ఈయూ మధ్య సుంకాల ఒప్పందాల అంచనాలు డిమాండ్ పడిపోవడానికి కారణమన్నారు. ఈ పరిస్థితుల్లో బంగారం ధరలు అస్థిరంగా ఉంటాయన్నారు. వచ్చే వారం ఫెడ్ వడ్డీ రేటు నిర్ణయంపై అందరి దృష్టి కేంద్రీకృతమైందని.. ఇది బులియన్ దారి చూపుతుందన్నారు. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్ రూ.92,100 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.1,00,480 పలుకుతున్నది. ఇక వెండి కిలోకు రూ.1.28లక్షలు పలుకుతున్నది.