Gold-Silver Price | పసిడి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. నిన్న స్వల్పంగా దిగి వచ్చిన ధర తాజాగా పెరిగింది. స్టాకిస్టులు కొనుగోళ్లకు దిగడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 24 క్యారెట్ల బంగారంపై రూ.550 పెరిగి తులం రూ.99,120కి చేరుకుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.500 పెరిగి తులానికి రూ.98,600కి చేరింది. మరో వైపు వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. వరుసగా మూడో సెషన్లోనూ ధర స్థిరంగా ఉన్నది. కిలోకు రూ.1,04,800 పలుకుతున్నది. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 11.42 డాలర్లు పెరిగి 3,325.09 డాలర్లకు ఎగిసింది. సోమవారం నాటి పతనం నుంచి పసడి కోలుకుందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు.
మళ్లీ వాణిజ్య యుద్ధం మొదలవనున్నదనే భయాందోళనలు పెరిగాయి. ఆగస్టు ఒకటి నుంచి వచ్చే అములోకి వచ్చే.. జపాన్, దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 25శాతం సుంకం విధించాలని ట్రంప్ ఆదేశించిన నేపథ్యంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకులు (కమోడిటీస్) సౌమిల్ గాంధీ మాట్లాడుతూ.. ట్రంప్ నిర్ణయాలు అమెరికా వాణిజ్య విధానాలను సంస్కరించడానికి ఆయన చూపుతున్న చొరవను ప్రతిబింబిస్తున్నాయన్నారు. సుంకాల వివాదం మార్కెట్లో అనిశ్చితిని సృష్టించిందని పేర్కొన్నారు. దాంతో పెట్టుబడులకు సురక్షితంగా భావించే బంగారానికి అనుకూలమైన వాతావరణం నెలకొంటుందన్నారు. పెట్టుబడిదారులు యూఎస్ సుంకాలతో పాటు ఫెడ్ రిజర్వ్ వ్యాఖ్యలు, తాజా ద్రవ్యోల్బణం డేటాను నిశితంగా పరిశీలిస్తున్నారని.. ఇవన్నీ రాబోయే కాలంలో బంగారం ధరలను ప్రభావితం చేస్తాయని అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చింతన్ మెహతా తెలిపారు.
ఏంజెల్ వన్‌లోని కమోడిటీస్ అండ్ కరెన్సీస్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ తేజస్ షిగ్రేకర్ మాట్లాడుతూ.. బలహీనమైన యూఎస్ ఆర్థిక డేటా, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణంతో మార్కెట్ ఇబ్బందిపడుతుందన్నారు. జూన్ నుంచి డాలర్ బలహీనపడిందని.. వినియోగదారులను బంగారం ఆకర్షిస్తుందని షిగ్రేకర్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్‌లోని బంగారం ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల పసిడి రూ.90,600 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,840 పలుకుతున్నది. ఇక వెండి ధర రూ.1,19,900 వద్ద ట్రేడవుతున్నది.