Gold Rates | దేశ రాజధానిలో సోమవారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.150 పెరిగి రూ.79,350లకు చేరుకున్నది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ హెచ్చరికలు, ఆర్థిక విధానాన్ని బట్టి 2025లో బంగారం ధర ఆధార పడి ఉంటుందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం తులం బంగారం (99.9 శాతం స్వచ్ఛత) ధర రూ.79,200 పలికింది. ఇక సోమవారం కిలో వెండి ధర ఫ్లాట్‌గా రూ.91,700 వద్ద కొనసాగింది. 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర సోమవారం రూ.150 పుంజుకుని 78,950 (శుక్రవారం రూ.78,800) పలికింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో గోల్డ్ కాంట్రాక్ట్స్ ఫిబ్రవరి డెలివరీ బంగారం తులం ధర రూ.41 తగ్గి రూ.76,503లకు పడిపోయింది. సిల్వర్ కాంట్రాక్ట్స్ మార్చి డెలివరీ కిలో వెండి ధర రూ.60 వృద్ధితో రూ.88,947లకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ గోల్డ్‌లో ఔన్స్ బంగారం ధర 5.70 డాలర్ల పతనంతో 2626.20 డాలర్లకు చేరుకుంది. కామెక్స్ సిల్వర్’లో ఔన్స్ వెండి ధర ఫ్లాట్‌గా 29.96 డాలర్ల వద్ద కొనసాగింది.