ముంబై, జూన్ 21: దేశంలో పసిడి రీసైక్లింగ్ జోరందుకున్నది. గడిచిన సంవత్సరంలో దేశీయంగా 75 టన్నుల గోల్డ్ రీైస్లెకింగ్ జరిగిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజాగా వెల్లడించింది. ప్రపంచ పసిడి రీసైక్లింగ్ దేశాల్లో భారత్ నాలుగో స్థానానికి ఎగబాకిందని ‘గోల్డ్ రిఫైనింగ్ అండ్ రీసైక్లింగ్’ పేరుతో విడుదల చేసిన నివేదికలో తెలిపింది. ఈ జాబితాలో 168 టన్నులతో చైనా అగ్రస్థానంలో నిలువగా, ఆ తర్వాతి స్థానాల్లో ఇటలీ, అమెరికా, భారత్లు ఉన్నాయి.
2013లో భారత్లో కేవలం 300 టన్నుల గోల్డ్ రీసైక్లింగ్ కెపాసిటీ కలిగివుండగా, ఇది ప్రస్తుతం 500 రెట్లు పెరిగి 1,500 టన్నులకు చేరుకున్నదని పేర్కొంది. గడిచిన పదేండ్లలో భారత్లో గోల్డ్ రిఫైనింగ్లో భారీ మార్పులు వచ్చాయని, సంస్థల సంఖ్యకూడా ఐదు నుంచి 33కి చేరుకున్నాయని తెలిపింది. మరోవైపు, అసంఘటిత రంగంలో 300-500 టన్నుల వరకు రీసైక్లింగ్ జరిగినట్లు తెలిపింది. కాలుష్యానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యల కారణంగా అసంఘటిత రిఫైనింగ్ భారీగా తగ్గిందన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. భారత్లో గోల్డ్ రీసైక్లింగ్ పెరగడానికి దిగుమతి సుంకం కారణమని విశ్లేషించింది.
రూపాయి పతనం, దేశ ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉండటం వల్లనే గోల్డ్ రీసైక్లింగ్ మార్కెట్ భారీగా పెరిగింది. ఆభరణాలు కొనుగోలు చేసే యువత తరుచుగా తమ డిజైన్లు మారుస్తుండటంతో రీసైక్లింగ్ పెరగడానికి ప్రధాన కారణం.
– సోమసుందరం పీఆర్, డబ్ల్యూజీసీ రీజినల్ సీఈవో