Gold Rate | దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధర తగ్గుముఖం పడితే.. అంతర్జాతీయ మార్కెట్లో మూడు వారాల గరిష్ఠ స్థాయికి పెరిగింది. పెరుగుతున్న ధరలను కట్టడి చేయడానికి గతవారం యూఎస్ ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్లు పెంచిన తర్వాత అమెరికా డాలర్ బలహీన పడింది. ఫలితంగా ఇన్వెస్టర్‌కు ఆల్టర్నేటివ్ పెట్టుబడి మార్గంగా ఉన్న బంగారం ధర పెరిగింది. సోమవారం మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1764.32 డాలర్లు పలికింది. జూలై 6 న ఔన్స్ బంగారం ధర 1767 డాలర్లు పలికింది. యూఎస్ ఫ్యూచర్స్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1779.90 డాలర్లు పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్‌కు భిన్నంగా దేశీయ బులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర తగ్గుముఖం పట్టింది. వరుసగా మూడు సెషన్లలో రూ.1000 పెరిగిన బంగారం ధర సోమవారం 0.5 శాతం తగ్గి పది గ్రాముల బంగారం మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో రూ.51,046 పలికింది. మరోవైపు కిలో వెండి ధర 0.6 శాతం తగ్గి రూ.58,032 పలికింది.
ఇండియన్ బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) వెబ్సైట్ ప్రకారం తులం బంగారం (24 క్యారట్లు) ధర రూ.61 తగ్గి రూ.51,405లకు చేరుకున్నది. అదే 23 క్యారట్ల బంగారం (పది గ్రాములు) ధర రూ.51,199, 22 క్యారట్ల పుత్తడి రూ.47,087, 18 క్యారట్ల బంగారం రూ.38,554 పలికింది.